ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్ లపై నిత్యం సవాళ్లు విసురుతున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై మొదటిసారిగా రాష్ట్ర మంత్రి కెటి రామారావు మాటల దాడికి పాల్పడ్డారు. దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇటీవలే అసెంబ్లీ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో తెలంగాణలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కరీంనగర్ పర్యటనలో భాగంగా గురువారం రూ 1,067కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ మార్క్ ఫెడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కరీంనగర్‌ను సీఎం కేసీఆర్ లక్ష్మీనగరంగా చూస్తారని, ఇక్కడ ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుందని నమ్ముతారని చెప్పారు.
కరీనంగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ తనను గెలిపించిన ప్రజల కోసం ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ స్టేటస్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎంపీగా గెలిచి మూడేండ్లు అయినా కరీంనగర్ పట్టణం కోసం కనీసం రూ.3కోట్ల పని కూడా సబ్బాత్ చేయలేదని మండిపడ్డారు. వర్గాల పేరుతో ప్రజల మధ్య పంచాయితీ పెట్టడం తప్ప బండి సంజయ్‌కు ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని కూడా మాట్లాడలేదని కేటీఆర్ ఫైరయ్యారు.
రోజూ సీఎం కేసీఆర్‌ను దుర్భాషలాడడం, ఆయనపై విరుచుకుపడ్డడం తప్ప సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసింది గుండు సున్నా అని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 15వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన కమలాకర్‌కు ఈ దఫా లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని మంత్రి కరీంనగర్ పట్టణానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అడ్డి మార్ గుడ్డి దెబ్బ అన్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన బండి సంజయ్ తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఎంపీగా గెలిచారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి పరిమితమైన బండి సంజయ్ కరీంనగర్ జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఉదయం లేచింది మొదలు యువతీ యువకుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే తప్ప ఆయన ఏం చేశారని నిలదీశారు.
మందిర్, మసీదు అంటూ మాట్లాడడం తద్వారా రెండు, మూడు ఓట్లు పొందడం బిజెపికి పరిపాటిగా మారిందని చెబుతూ కనీసం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా అనుమతి తీసుకురాలేకపోయారని సంజయ్‌పై విరుచుకుపడ్డారు. గంగుల కమలాకర్ పది ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణానికి అనుమతి తీసుకువచ్చి ఈ పనులను ప్రారంభించారని గుర్తు చేశారు.
అంతకు ముందు రోజు, హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ నగరంలో నెలకొన్న వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రూ. 10వేల కోట్ల్ల నిధులను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తేవాలని పరోక్షంగా సవాల్ విసిరారు.
అకాల వర్షాలతో నగరం వరద ముంపునకు గురైతే కేంద్ర బృందం పర్యటించింది తప్పితే పైసా కూడా మంజూరు చేయలేదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసారు. నిధులను తెస్తే కేంద్ర మంత్రికి నగర నడిబొడ్డున పౌర సన్మానం ఘనంగా చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని ఆ తరువాత కలిసికట్టుగా అందరం హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేద్దామని చె కెటిఆర్ పిలుపునిచ్చారు.