తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుండి విలక్షణమైన నాయకులుగా ఉంటూ, తమకంటూ సొంత బలం ఏర్పర్చుకున్న కోమటిరెడ్డి సోదరులు పార్టీ అధిష్టానం వైఖరి పట్ల తమ అసంతృప్తిని తరచూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా అవినీతి పాలకుడు, నియంత కేసీఆర్‌ను గద్దెదింపడమే తన లక్ష్యమని అంటూ అందుకు ఏ పార్టీతో అయినా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రకటించారు.
అంతకు రెండు రోజుల ముందే ప్రధాని నరేంద్ర మోదీని కలసి సింగరేణి బొగ్గు గనులలో ఒక టెండర్ ను కైవసం చేసుకోవడం ద్వారా కేసీఆర్ కుటుంభం భారీ అవినీతికి స్కెచ్ వేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఈ దోపిడీని అరికట్టామని కోరారు. ఈ ప్రకటనలు చూస్తుంటే వారిద్దరూ బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
చాలా సంవత్సరాలుగా తెలంగాణలోని కాంగ్రెస్ నాయకత్వం అధికార పార్టీతో కుమ్మక్కై పార్టీని ఎదగనీయడం లేదని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తమకు పిసిసి నాయకత్వం అప్పగిస్తే రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తామని చెబుతున్నారు. `తెలుగు దేశం’ నుండి వచ్చిన రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించడం పట్ల బహిరంగంగానే తిరుగుబాటు చేశారు.
రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కాంగ్రెస్ భవన్ లో అడుగుపెట్టానని శపధం కూడా చేశారు. అప్పటి నుండి పిసిసి కార్యక్రమాలకు దూరంగా, జిల్లాకే పరిమితమవుతూ వస్తున్నారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. పలువురు బిజెపి నేతలతో సమాలోచనలు కూడా జరిపారు.
అయితే వీరొస్తే తమ నాయకత్వంకు ఇబ్బందనే భావనతో రాష్ట్రంలోని కీలక నాయకులు వీరు పార్టీలో చేరకుండా అడ్డుపడ్డారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు 2023లో తెలంగాణాలో ఎట్లాగైనా బిజెపిని అధికారంలోకి తీసుకు రావడంకోసం బిజెపి కేంద్ర నాయకత్వమే ఇతర పార్టీల నాయకులను ఆహ్వనింస్తుడటం, డీకే అరుణ, ఈటెల రాజేందర్ వంటి వారికి ప్రాధాన్యత ఇస్తుండడంతో కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరడానికి సిద్దపడడానికి సిద్దపడుతున్నారని తెలుస్తున్నది.
పైగా, సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమన్న వాదనలు రోజురోజుకూ బలపడుతుండటంతో వీరిద్దరూ గత వారం రోజులుగా బీజేపీకి అనుకూలంగా, ఓ వైపు రేవంత్‌రెడ్డిని, మరో వైపు సీఎం కేసీఆర్ పై విమర్శలు కురిపిస్తూ ప్రకటనలు చేస్తూ వస్తుండడంతో అందరి దృష్టి వారిపై పడుతున్నది.
గౌరవం ఇవ్వని చోట ఉండలేను.. ఎవరి కింద పడితే వారి కింద పనిచేయను.. తగిన వేదిక ద్వారా సీఎం కేసీఆర్‌పై పోరాడుతా.. పార్టీ మార్పు పై త్వరలో స్పష్టత ఇస్తా.. నన్ను నమ్మిన వారు నావెంట రావొచ్చు.. అంటూ బుధవారం జిల్లా పర్యటనలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
అసెంబ్లీలో మంత్రి తలసాని, తన మధ్య జరిగిన మాటల యుద్ధంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు మద్దతుగా గట్టిగా నిలబడి ఉండాల్సింది పోయి ఇద్దరూ మా ట్లాడింది తప్పు అనడం, తన మాటలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించి, తలసానివి అలాగే ఉంచడం పట్ల వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .
గత ఏడాది జనవరి 1న తిరుమలలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ ఎదుగుతోందని, రానున్న రోజుల్లో తాను చేరే అవకాశం కూడా ఉందని పేర్కొనడం గమనార్హం. దీంతో రాజగోపాల్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అంచనాలకు మించి విజయాలు సాధించడంతో రాష్ట్రంలోని కీలక కాంగ్రెస్ నేతలు, టీఆర్‌ఎ్‌సలో అసంతృప్త నేతలు బిజెపి వైపు చూస్తుండటం కనిపిస్తున్నది.
ఈ నెల చివర జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అతిథిగా భారీ సభ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ సభలో పాలు పార్టీల్లోని కీలక నేతలు బీజేపీలో చేరతారన్న ప్రచారం ఉంది. తనతో అమిత్‌షా టచ్‌లో ఉన్నారంటూ రాజగోపాల్‌రెడ్డి అనుచరుల వద్ద పలుమార్లు చెబుతున్నట్లు తెలుస్తున్నది.