తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భరోసాతో ఉన్న పార్టీ కార్యకర్తలకు గత ఏడాది చివరిలో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో పార్టీ నాయకత్వ వైఫల్యం కారణంగా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయామని గుర్తు చేస్తూ, అటువంటి దుర్ఘటనలు పార్టీకి తిరిగి జరగకుండా ఉండాలంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మార్చవలసిందే అని తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
మాజీ మంత్రి మర్రి శశిధరరెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు, ఎమ్యెల్యే జగ్గారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో జరిగిన `అసమ్మతి నేతల’ సమావేశం ఈ విషయమై పార్టీ అధిష్ఠానంతో తాడో, పేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. తెలంగాణాలో పార్టీ ప్రగతికి అడ్డుకట్ట వేస్తున్న రేవంత్ తో పాటు కేంద్ర పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ ఠాకూర్ లపై పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
తమది అసమ్మతి వర్గం కాదని, పార్టీ విధేయులుగా కలుసుకున్నామని ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది తొలిసారి కాదని, గత మూడేళ్లుగా కలుసుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తాము ఏవిధంగానూ వ్యతిరేకించడం లేదని జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాలను తప్పక పాటిస్తామని తెలిపారు.
హోటల్ ఆశోకలో ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. రేవంత్రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలందరూ భేటీ అయ్యారు. తమ సమస్యలు అధిష్ఠానానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఈ భేటీ పూర్తిగా తమ వ్యక్తిగతం అని పేర్కొన్నారు. మరోవైపు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
దమ్ముంటే అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని రేవంత్ కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. సీనియర్ నేత వీహెచ్ మంత్రి హరీష్ రావును కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. తన కూతురు కోసమే హరీశ్ రావును వీహెచ్ కలిశారని తెలిపారు. మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎవరు?అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోనియా, రాహులే అంతిమ నిర్ణయం తీసుకుంటారని తలిపారు.
రేవంత్ ఒక్కడే పార్టీని అధికారంలోకి ఎలా తీసుకొస్తాడని నిలదీశారు. అంతా కలిస్తేనే ఏమైనా చేయొచ్చు అని ఆయన స్పష్టం చేశారు. తనపై అభ్యర్థిని పెట్టి గెలిపించు.. అప్పుడే నువ్వే హీరో అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్తున్నాడని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పంచాయితీ కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.