ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 11 రోజులైనా బిజెపి గెలుపొందిన నాలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఒక్క చోట కూడా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయలేదు. ఇప్పటి వరకు అధికారికంగా కేవలం ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్, మణిపూర్ లో బీరెన్ సింగ్ ల పేర్లను మాత్రమే ప్రకటించారు. వారిద్దరూ ప్రస్తుత ముఖ్యమంత్రులే. అయితే వారిద్దరూ కూడా తాత్కాలికమే అని, తర్వాత మార్చే అవకాశం ఉన్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
మరోవంక, ఉత్తరాఖండ్, గోవా లలో ఈ రోజు నూతన ముఖ్యమంత్రులు ఎవ్వరో తెలిసే అవకాశం ఉంది. శాసనసభ పార్టీల సమావేశాలు ఈ రోజు జరుగుతున్నాయి. ఆప్ గెలుపొందిన పంజాబ్ లో ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంతో ఐదు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేయడం, మంత్రివర్గాన్ని విస్తరించడం కూడా జరిగిపోయింది.
బిజెపి అంతర్గత కలహాలు, ముఠా తగాదాల కారణంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోతోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. గోవాలో ఎన్నికల ప్రచారానికి సారధ్యం వహించి, 20 మందిని గెలిపించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేరును వారిలో 17 మంది ఎమ్యెల్యేలు సూచిస్తున్నా ఖరారు చేయడంలో తీవ్ర జాప్యంపై పార్టీ వర్గాలలో అసహనం వ్యక్తం అవుతున్నది.
ఉత్తరాఖండ్ లో ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓటమి చేయడం, ఆ పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతూ ఉండడంతో వారిలో ఒకరిని ఖరారు చేయడం పార్టీ నాయకత్వానికి సమస్యగా పరిణమించింది. నాలుగైదు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి అప్రదిష్టను మూటగట్టుకున్న బిజెపి నాయకత్వం ఈ పర్యాయం కూడా ఉత్తరాఖండ్ లో సీఎం ఎంపికలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మణిపూర్ లో కేంద్ర పరిశీలకురాలిగా వెళ్లిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ముఖ్యమంత్రిని బీరెన్ సింగ్ ను శాసనసభ్యులు అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆదివారం ప్రకటించినా అక్కడ అసమ్మతి రగిలిపోతున్నట్లు తెలుస్తున్నది.
ఎన్నికల ఫలితాలు రాగానే మణిపూర్ లో అసమ్మతి రాగాలు ప్రారంభం అయ్యాయి. దీంతో వెంటనే సిఎం బీరేన్ సింగ్ ను ఢిల్లీకి పిలిచారు. ఎన్ బీరెన్ సింగ్‌తో పాటు, బిస్వజిత్ సింగ్ , యుమ్నం ఖేమ్‌చంద్ పేర్లను కూడా చర్చించింది.
అయితే చివరికి పార్టీ ఎన్ బీరెన్ సింగ్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది. ఇపుడు ఇదే రచ్చగా మారింది. దీంతో ప్రస్తుతానికి తాత్కాలిక సిఎంగా నియమించాలని బిజెపి నిర్ణయించింది. ఆ లోగా బీరేన్ ను తొలగించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
25న లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని, వచ్చే ఏడాదిలోగా ఎప్పుడైనా మార్చే అవకాశం లేకపోలేదని పార్టీలోని కొన్ని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి గత ఏడాది ఆగష్టు లోనే ఆయనను మార్చాలని ప్రయత్నం చేశారు .
అయితే ఆయన ఒక విధంగా బలప్రదర్శనకు దిగడంతో ఎన్నికల ముందు రచ్చ ఎందుకులే అంటూ వెనుకడుగు వేశారు. అప్పటి నుండి ఆయన పేరుతోనే ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవాలలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పేరును ఒకసారి కూడా ప్రస్తావించక పోవడం గమనార్హం.
యుపిలో ఒక ముఖ్యమంత్రి తిరిగి ఎన్నిక కావడం రికార్డు అని మాత్రమే అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించామని మాత్రమే చెప్పారు. ఎన్నికల ప్రచారంలో యోగి పాలనను పొగడ్తలతో ముంచెత్తిన నాయకులు ఎన్నికల అనంతరం ఆ ప్రస్తావన తీసుకు రావడం లేదు. దానితో 2024 లోక్ సభ ఎన్నికల నాటికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.