రాష్ట్ర పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై కొంతకాలంగా తిరుగుబాటు ధోరణిలో బారంగంగా సవాళ్లు విసురుతున్న సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డికి పిసిసి షాక్ ఇచ్చింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల నుంచి పిసిసి జగ్గారెడ్డిని తప్పించింది. అంతేకాకుండా, పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల నుంచి, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా ఆయనను తప్పించింది.
జగ్గారెడ్డి ఇప్పటి వరకు నిర్వహించిన బాధ్యతలను పిసిసి ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగించింది. అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ లకు రేవంత్ ఆ బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం మేరకే పిసిసి జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంది.
తాను స్వతంత్రంగా ఉంటానని, కాంగ్రెసు ఎంఎల్ఎగా ఉండబోనని గతంలో జగ్గారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఆ నేపథ్యంలోనే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధిష్టానం పిసిసికి సూచించినట్లు తెలుస్తోంది.
తాజాగా రేవంత్‌కి జగ్గారెడ్డి ఆదివారం సవాల్ విసిరారు. తనపై కాంగ్రెసు తరఫున ఎవరినైనా పోటీకి దించి గెలిపించుకోవాలని ఆయన ఆ సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేసే దమ్ములు ఎవరికీ లేవని కూడా ఆయన చెప్పారు. షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెప్తానని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో జగ్గారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఇదిలావుంటే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన మంగళవారం కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ ఠాగూర్ ను కలుస్తారు. తాజా పరిణామాలపై రేవంత్.. ఠాగూర్ కు వివరించే అవకాశం ఉంది.
జగ్గారెడ్డితో పాటు వి హనుమంతరావు వంటి సీనియర్లు కొంత మంది అశోకా హోటల్ లో పెట్టిన సమావేశంపై కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. జగ్గారెడ్డి వ్యవహారాన్ని అధిష్టానం కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తాజా పరిణామం తెలియజేస్తోంది. అసంతృప్త నేతలు ఓ వైపు అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూనే రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.