అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులకు వ్యతిరేకంగా వీడియోలను ప్రజలు అప్లోడ్ చేసేందుకు అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్‌ను పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ బుధవారం ప్రారంభించారు.
స్వాతంత్య్ర వీరులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ అమరులైన రోజున అవినీతి నిరోధక యాక్షన్ లైన్ పేరిట దీన్ని ప్రారంభించారు. ప్రజలు నేరుగా 9501200200 నంబర్‌కు డయల్ చేసి అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయవచ్చు.
ఈనెల 16న ఖట్కర్ కలాన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మాన్ నెలరోజుల్లో అవినీతిని అంతం చేయడానికి ప్రజల సహకారాన్ని అర్థించారు. మార్చి 23న హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభిస్తానని ప్రజలకు వాగ్దానం చేశానని, ఆ ప్రకారమే మాట నిలబెట్టుకున్నానని ఒక వీడియోలో మాన్ తెలియచేశారు.
లంచం అడిగే అధికారులకు సంబంధించిన వీడియోలను ఈ నంబర్‌కు పంపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ ఫిర్యాదులను సిబ్బంది దర్యాప్తు చేసి దోషి అని తేలితే అధికారి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆయన స్పష్టం చేశా రు. ఈ నంబర్‌కు అవినీతికి సంబంధించిన వీడియోలను మాత్రమే పంపాలని ఆయన ప్రజలను కోరారు.