మహారాష్ట్రలో వరుసగా అధికారంలో ఉన్న పార్టీల నేతలు లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జరుపుతున్న దాడులు రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసినా 24 గంటలలో కూలిపోవడం, వెంటనే సుదీర్ఘకాలం బిజెపి మిత్రపక్షంగా ఉన్న శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలసి కూటమి ఏర్పాటు చేసి అధికారమలోకి రావడాన్ని బిజెపి నాయకులు తమాయించుకోలేక పోతున్నట్లు కనిపిస్తున్నది.
అంతర్గత కలహాలతో ఆ ప్రభుత్వం సత్వరం కూలిపోతుందని అనుకున్న బిజెపి నాయకులకు రెండేళ్లు దాటినా సుస్థిరంగా కొనసాగుతూ ఉండడంతో అసహనానికి గురవుతున్నారు. ఈ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.
ప్రభుత్వం పడగొట్టడంతో కలసి రమ్మనమని బిజెపి నాయకులు తనను కోరారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొనడం గమనార్హం. పైగా కూటమి నుండి బైటకు వస్తే ఉద్ధవ్ థాకరే ను ముఖ్యమంత్రిగా తాము మద్దతు ఇస్తామని పలువురు బిజెపి నాయకులు బహిరంగంగానే పిలుపిచ్చారు. అయితే ఆ ప్రభుత్వంలో ఎటువంటి ప్రకంపనాలు రాకపోవడంతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించి, పడగొట్టే ప్రయత్నాలు తిరుగుతున్నాయని అధికార కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్‌లను ఇడి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే బంధువు కార్యాలయాలపై కూడా తాజాగా ఇడి దాడులు చేస్తోంది.
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించిన ఇడి ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను అటాచ్ చేసింది. థాకరే బావమరిది శ్రీధర్ మాధవ్ పటాంకర్ పేరుతో ఉన్న శ్రీసాయిబాబా గఅహ నిర్మితి ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. వీటి విలువ 6.45 కోట్లు ఉంటుందని సమాచారం.
పుష్పక్ గ్రూప్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీసాయిబాబా గృహహనిర్మితికి నగదును బదిలీ చేసినట్లు సమాచారం వచ్చిందని ఇడి వెల్లడించింది. పుష్పక్గ్రూప్కేసు నిందితుడు మహేష్ పటేల్, మరో నిందితుడు నందకిశోర్ చతుర్వేది సాయంతో శ్రీధర్ మాధవ్ సంస్థలోకి నగదును బదిలీ చేసినట్లు తెలిపింది.
సుమారు ఏయే 50 కోట్లను శ్రీధర్ మాధవ్ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపింది. కాగా, శ్రీధర్ మాధవ్ ఆస్తులను ఇడి అటాచ్ చేయడంపై సంజరు రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపియేతర రాష్ట్రాల్లో మాత్రమే ఇడి చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. గుజరాత్, యుపి వంటి రాష్ట్రాల్లో ఆ సంస్థ తన కార్యాలయాలను మూసేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు.