ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్త సర్కారు కొలువుదీరింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ ఆనందీ బెన్ యోగితో ప్రమాణ స్వీకారం చేయించారు.
యూపీలో వరుసగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన యోగి 37ఏళ్ల రికార్డు బ్రేక్ చేశారు. ఆయనతో పాటు 52 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఏకానా క్రికెట్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరయ్యారు.
యూపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంల సంప్రదాయాన్ని కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో కేశవ్ ప్రసాద్ ఓటమి పాలైనప్పటికీ ఆయనకు మరోసారి అవకాశమిచ్చారు. ఇక గత ప్రభుత్వంలో డిప్యూటీగా ఉన్న దినేశ్ శర్మ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ స్థానాన్ని బ్రిజేష్ పాఠక్‌తో భర్తీ చేశారు.
గతంలో న్యాయ శాఖ మంత్రిగా ఉన్న బ్రజేష్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేత. ఆ సామాజిక వర్గంలో బ్రజేష్‌కు మంచి పలుకుబడి ఉంది. వీరితో పాటు ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు, ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేసిన ఎకే శర్మకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.
52 మంది మంత్రులతో యోగి కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో 18 మందికి కేబినెట్ హోదా, 14 మందికి స్వతంత్ర హోదాను కల్పించారు. తన మంత్రి వర్గంలో మరో 20 మంది సహాయ మంత్రులకు సీఎం చోటు కల్పించారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఉత్తరాఖండ్ గవర్నర్‌గా రాజీనామా చేసిన బేబి రాణి మౌర్య, కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాద, అసిమ్ అరుణ్, స్వతంత్ర దేవ్ సింగ్, దినేశ్ కార్తీక్, సందీప్ సింగ్, అరుణ్ వాల్మీకి, ఆశీష్ పటేల్, సంజయ్ నిషాద్, దయాశంకర్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, రవీంద్ర జైస్వాల్, సలీల్ విష్ణోయ్, యోగేంద్ర ఉపాధ్యాయ తదితరులు నూతన మంత్రివర్గంలో ఉన్నారు.