తనను జైల్లో పెట్టాలనేదే బీజేపీ లక్ష్యమైతే పెట్టండంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే రాష్ట్ర శాసనసభలో సవాలు విసిరారు. అధికారంలోకి రావాలనుకుంటే రావాలని, అంతే కానీ దుర్మార్గాలకు పాల్పడొద్దని అంటూ సుదీర్ఘకాలం తమ పార్టీ మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఆయన హితవు చెప్పారు.
తాజాగా ఉద్ధవ్ బావమరిదిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి రూ 6.45 కోట్ల ఆస్తులను జప్తు చేసిన రెండు రోజులకు ఆయన ఈ సంఘటనపై ఘాటుగా స్పందించారు.
‘‘ఇదంతా (ఈడీ దాడులు) అధికారం కోసమేగా అధికారంలోకి రావాలనుకుంటే రండి. కానీ ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాను. మేము మీ (బీజేపీ) కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అలా అని మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఎలాంటి తప్పులూ చేయలేదని కాదు. కానీ, ఎవరి కుటుంబ సభ్యులపైనా వేధింపులకు దిగొద్దు’’ అని ఉద్ధవ్ భావోద్వేగంగా ప్రసంగించారు.
అంతకు ముందు మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నవాబ్ మాలిక్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్‌కు కూడా తెలుసని ఆయన ఘాటుగా స్పందించారు. అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకుని చంపేస్తారా? అని ప్రధాని మోదీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు.
ఈ క్రమంలోనే బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీదుగా ఓట్లు అడిగిందని, ఇప్పుడు దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి సిద్ధపడిందా? అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి నవాబ్ మాలిక్ నిజంగా దావూద్‌తో సంబంధాలుంటే కేంద్ర దర్యాప్తు బృందాలు ఇన్ని రోజులు ఎందుకు దాడులు చేయలేదని, ప్రశ్నించలేదని బీజేపీని నిలదీశారు.
ఉద్ధవ్ భార్య రేష్మా సోదరుడు అనిల్ పరభ్ సహా ఉద్ధవ్ కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరేలపై ఈడీ కొద్ది రోజులుగా దాడులు చేస్తోంది. వీరే కాకుండా పార్టీలోని కీలక నేతల సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ దాడులు చేస్తోంది. అయితే ఇదంతా తమపై అక్కసుతో ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని, బీజేపీని మహారాష్ట్రలో అధికారంలోకి రాకుండా నిలువరించినందుకే తమపై ఇలా కక్షసాధింపుకు పాల్పడుతోందని శివసేన ఆరోపిస్తోంది.