చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం ఆకస్మికంగా భారతదేశ పర్యటనకు వచ్చారు. రెండేళ్ల విరామం తరువాత చైనా ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధి ఒకరు భారతదేశానికి వచ్చారు. లద్థాఖ్ సరిహద్దులలో ప్రతిష్టంభన ఇప్పటికీ కొనసాగుతోన్న దశలో చైనా విదేశాంగ మంత్రి ఇక్కడికి చేరుకున్నారు.
శుక్రవారం వాంగ్ యీ విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమాయ్యారు. ఇరు దేశాల నేతల మధ్య ముఖాముఖి చర్చల ఆరంభానికి చైనా విదేశాంగ మంత్రి ఆగమనం సంకేతంగా మారింది. ఈ ఏడాది చివరిలో చైనా ఆతిథ్యంలో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు భారత ప్రధాని మోదీని ఈ పర్యటన సందర్భంగా వాంగ్ ఆహ్వానించారు.
చైనా నేత భారత పర్యటనపై తుది క్షణం వరకూ సస్పెన్స్ నెలకొంది. చైనా విదేశాంగ మంత్రి భారత రాజధాని ఢిల్లీకి ప్రత్యేక విమానంలో చేరుకున్న తరువాత కూడా ఆయన పర్యటన గురించి కానీ, కనీసం ఆయన ఇక్కడికి చేరుకున్నట్లు కానీ ఢిల్లీలో ఎటువంటి అధికారిక నిర్థారణ ప్రకటన వెలువడలేదు. అయితే ఆయన విమానం అఫ్ఘనిస్థాన్ నుంచి నేరుగా భారత్ దారి పట్టడాన్ని సాంకేతికంగా గుర్తించారు.
“అస్తవ్యస్తంగా” ద్వైపాక్షిక సంబంధాలు
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలుసుకుని, చైనా సైనికుల సమీకరణ కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు “అస్తవ్యస్తంగా” ఉన్నాయని, సరిహద్దు పరిస్థితిని పరిష్కరించే వరకు సంబంధాలు సాధారణంగా ఉండలేవని ఆయనకు స్పష్టం చేశారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశాన్ని ‘బహిరంగ, నిక్కచ్చి’ చర్చగా పేర్కొన్నారు.
ద్వైపాక్షిక సంబంధాల పట్ల బీజింగ్ యొక్క నిబద్ధత కొనసాగుతున్న విచ్ఛేదనలో పూర్తి వ్యక్తీకరణను కనుగొనాలని తెలిపారు.మిలిటరీ కమాండర్ల మధ్య 15 రౌండ్ల సరిహద్దు చర్చల తర్వాత, ద్వైపాక్షిక సంబంధాలు ‘పురోగతిలో పని’ అని మంత్రి చెప్పారు. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం,పరస్పర ఆసక్తులు అనే మూడు నిర్ణయాత్మక అంశాలను కూడా జైశంకర్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
‘ఏప్రిల్ 2020లో జరిగిన లడఖ్ ఘటన నుండి చైనాతో పెరుగుతున్న ఉద్రికత్తలు, ఘర్షణలు.. సాధారణ సంబంధాలతో రాజీపడలేవు. శాంతి, ప్రశాంతత పునరుద్ధణ అనేవి చర్చలతోనే సాధ్యం’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ రోజు సంబంధాలు సాధారణ స్థితికి వచ్చాయా అని అడిగితే.. కాదనే చెబుతానని అని తెలిపారు. సమస్యను పూర్తిగా పరిష్కరించడమే తమ ప్రయత్నంగా పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్థాన్‌లోని ఇస్లామిక్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్‌లో వాంగ్ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం గతంలో విమర్శించిన అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
జాతీయ ప్రయోజనాల పరిధిలోనే విదేశాంగ విధానం
దేశ విదేశాంగ విధానం పూర్తిగా జాతీయ ప్రయోజనాల పరిధిలోనే ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ రెండు రోజుల క్రితం రాజ్యసభలో స్పష్టం చేయడం గమనార్హం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలు కోణంలోనే అన్ని విధానాలు ఉంటాయని, ఇందులో ఇమిడి ఉండేదే విదేశాంగ విధానం అని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు.
అయితే ఇదే దశలో దేశాల ప్రాంతీయ సమగ్రతలు, సార్వభౌమాధికారానికి అంతర్జాతీయ వ్యవస్థ నుంచి తగు గౌరవభావం దక్కాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రత్యేకించి ఉక్రెయిన్‌లో పరిస్థితిని ప్రస్తావిస్తూ దీనికి మన దేశ వ్యాపార వాణిజ్య అంశాలకు ఎటువంటి సంబంధం లేదని, ఉండరాదని, ఇవి రెండూ విభజిత అంశాలని తేల్చిచెప్పారు.
శాంతికాముక దేశంగా భారత్ ఎక్కడైనా శాంతిని కోరుకుంటుంది. అయితే దేశ ప్రయోజనాలు ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితికి ఊతం అందించే వ్యాపార వాణిజ్య అంశాలపై రాజీ పడే అవకాశం ఉండదని జైశంకర్ తెలిపారు.