మగవారు లేకుండా ఆడవాళ్లను విమానాలు ఎక్కేందుకు తాలిబన్ ప్రభుత్వ నిరాకరించింది. ఫలితంగా ముందే టికెట్లు బుక్ చేసుకొని కూడా ఆఫ్ఘన్ మహిళలు విమానాలెక్కలేకపోయారు. మహిళలు 72 కిలోమీటర్ల దూరానికి మించి ప్రయాణించాలంటే మగవారు తప్పనిసరిగా ఉండాలని తాలిబన్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో కెనడా వంటి ఇతర దేశాల పౌరసత్వం ఉన్న ఆఫ్ఘన్ మహిళలను కూడా అనుమతించేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. పాకిస్తాన్, దుబాయ్, టర్కీ దేశాలకు వెళ్లడానికి కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన అనేకమంది మహిళలను విమానాలు ఎక్కనివ్వలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
మగవారి తోడు లేకుండా వారు విమాన ప్రయాణాలు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. తాలిబాన్ల నుండి వచ్చే పరిణామాలకు భయపడి పేరు తెలుప నిరాకరిస్తూ మాట్లాడిన అధికారులు, దేశీయ , అంతర్జాతీయ విమానాలలో ఎక్కడానికి శుక్రవారం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన డజన్ల కొద్దీ మహిళలు మగ సంరక్షకుడు లేకుండా అలా చేయలేకపోయారని వెనుదిరిగారని తెలిపారు.
బాలికలను ఆరో తరగతి తరవాత హైస్కూళ్ల చదువుపై నిషేధం చేసిన తాలిబన్లు ఇప్పుడు కొత్తగా విమానాల్లోకీ అనుమతించడం లేదు. ఇలా తరుచూ తాలిబన్ ప్రభుత్వం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. తాలిబన్లు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడటంతో వారిపై విశ్వాసం పోతోందని ఆఫ్ఘన్ పౌరహక్కుల కార్యకర్త మెహబూబా సిరాజ్ జాతీయ మీడియాకు తెలిపారు.
ఆఫ్ఘన్ బాలికలకు స్కూళ్లలో ప్రవేశం కల్పించాలంటూ ప్రపంచ దేశాలు తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నిరుపేద దేశమనీ, అక్కడి ప్రజలకు విజ్ఞానం అందకుండా చేస్తే వారి భవిష్యత్తు అంధకారమౌతుందని మెహబూబ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.