అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి దోహదపడేలా అమరావతి రాజధాని నిర్మాణంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ విజ్ఞత ప్రదర్శించి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కోసం తీసుకొన్న భూముల్లో తక్షణం నిర్మాణ పనులను చేపట్టడం ద్వారా సానుకూల పాత్రను బాధ్యతతో పోషించాలని రాష్ట్ర ప్రజల తరుపున ప్రముఖ సామజిక కార్యకర్త టి లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన స్థలాన్ని ఆదివారం వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పోతుల బాలకోటయ్య, పరంధామయ్యలతో కలసి సందర్శించి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమకారులు కొందరితో అక్కడ సమాలోచనలు జరిపారు.
ప్రధాని మోదీ భారత పార్లమెంటు ప్రాంగణం నుండి మోసుకొచ్చిన మట్టి, గంగా జలం, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి సేకరించిన మట్టి, నదుల నుండి తీసుకొచ్చిన నీటిని, ఈ షేడ్ క్రింద చేర్చి, పరిరక్షిస్తున్నారు.”మన నీరు – మన మట్టి – మన అమరావతి” అక్షరాలు లిఖించిన బోర్డు అక్కడ స్ఫూర్తిదాయకంగా దర్శనమిస్తున్నది.
రాష్ట్రం నడిబొడ్డులో, రాజకీయాలకు అతీతంగా, వివాదరహితంగా, చట్టబద్ధంగా, నిర్ణయించుకున్న రాజధాని అమరావతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం “వికేంద్రీకరణ” ముసుగులో విధ్వంసానికి పూనుకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ళకు పైగా సాగుతున్న అలుపెరగని ప్రజా ఉద్యమం నేపథ్యంలో హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ద్వారా అమరావతే రాజధానని నిర్ద్వందంగా ప్రకటించిందని గుర్తు చేశారు.
హైకోర్టు తీర్పును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నదని లక్ష్మీనారాయణ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిదంటూ అవకాశవాద వైఖరి ప్రదర్శించిన మోదీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు కనువిప్పు కలిగించి ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని, అమరావతి రాజధాని నిర్మాణాన్ని యుద్ధప్రాతిదికపై పూర్తి చేయడానికి కార్యాచరణకు పూనుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.