‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై బిజెపి సర్కార్ మక్కువ చూపడంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మండిపడ్డారు. కాశ్మీర్ పండిట్ల కష్టాలపై కలత చెందని కమలం పార్టీ.. ఈ చిత్రంపై ప్రేమ కరిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ.. అక్కడి పండిట్లపై మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు.
పాక్ ఉగ్రమూకల దాడితో కాశ్మీర్ లోయను వీడిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు వెళ్లే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ… వారి కోసం ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించి.. అందరూ చూడాలని బిజెపి ప్రమోట్ చేయడంపై మండిపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఈ చిత్రాన్ని యూట్యూబ్లో పెడితే.. అందరూ చూస్తారంటూ ఇప్పటికే చురకలు అంటించారు. ఇప్పటి వరకు ఈ చిత్రంపై వసూలైన మొత్తాన్ని కాశ్మీర్ పండిట్ల సంక్షేమం కోసం వినియోగించాలని సూచించారు.
తాజాగా మనోష్ సిసోడియా స్పందిస్తూ.. అందరూ ఈ సినిమా చూడాలని ప్రమోషన్ చేయడం తప్పా.. వారి దుస్థితిపై ఏమాత్రం మోడీ సర్కార్ ఆలోచన లేదని ధ్వజమెత్తారు.
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కాశ్మీర్ పండిట్ల మేలు కోసం ఎంతో చేశామని ఆయన చెప్పుకొచ్చారు. 223 మంది టీచర్లకు సరైన పత్రాలు లేకపోయినా శాశ్వత హోదా కల్పించామని, పెన్షన్ వ్యవస్ధను క్రమబద్ధీకరించామని, ఢిల్లీలో కాశ్మీర్ పండిట్లకు ఒక్కొక్కరి నెలకు రూ. 3000 నగదు అందిస్తున్నారని వివరించారు.