ఏప్రిల్ 1వ తేదీ నుంచీ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని, 57 ఏళ్ళు దాటినవారికి కూడా మంజూరు చేస్తామని ప్రకటనలతో కేసీఆర్ సర్కారు ఊదరగొట్టిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి గుర్తుచేశారు.
తీరా చూస్తే ఏప్రిల్ 1వతేదీ అనేది కొన్ని గంటల్లోకి వచ్చేసినా పరిశీలన ప్రక్రియ మొదలుకాలేదని, సర్కారు ప్రకటనను నమ్మి పాపం దాదాపు 11 లక్షల మంది ఆసరా పింఛన్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆమె తెలిపారు. అయితే, కొత్త అప్లికేషన్లను పరిశీలనకు మార్గదర్శకాలు జారీ కాలేదని ఆమె పేర్కొన్నారు.
ప్రజలకు ఆసరాగా నిలిచి ఆదుకోవలసిన తెలంగాణ సర్కారు ఆ కర్తవ్యాన్ని మరిచిపోయి అధికార ఆసరా కోసం నానా పాట్లు పడుతోందని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం ఇస్తారా? లేదా… వచ్చిన దరఖాస్తులనే పరిశీలిస్తారా? వంటి ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయని ఆమె తెలిపారు.
రాష్ట్రంలో గత మూడేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు సరికదా… మృతుల స్థానంలో కూడా కొత్తవారికి అవకాశం కల్పించలేదని విజయశాంతి మండిపడ్డారు. ఈ మూడేళ్లలో ఆసరా లబ్ధిదారులలో 2,21,000 మందికిపైగా మృతిచెందినట్లు తెలుస్తుండగా… మరో 28 వేల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి పింఛను నిలిపివేశారని ఆమె ధ్వజమెత్తారు.
వీరి స్థానంలో అర్హులైనవారెవరికీ పింఛన్ ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రాలేదు. ఇక మరోవైపు 57 ఏళ్ళు దాటినవారికి కూడా పింఛన్ మంజూరు చేస్తామన్న సర్కారు… బడ్జెట్ కేటాయింపులు మాత్రం అదనంగా పైసా కూడా పెంచలేదని ఆమె వివరించారు.
పైగా గతేడాది కేటాయించిన రూ.11,728 కోట్ల బడ్జెట్లో రూ 9 వేల కోట్లు మాత్రమే ఖర్చయినందున ఈ సారి బడ్జెట్ కేటాయింపులు పెంచలేదని ప్రభుత్వ వర్గాలు విచిత్ర వాదన వినిపిస్తున్నాయని విజయశాంతి విస్మయం వ్యక్తం చేశారు.
65 ఏళ్ళు దాటిన దరఖాస్తు దారులు సుమారు 2 లక్షల 86 వేలమంది కాగా… 57-65 ఏళ్ల మధ్య దరఖాస్తుదారులు 7,98,000 మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మరి ఏడున్నర లక్షలకు పైగా ఆదనంగా దరఖాస్తులు వచ్చినప్పుడు బడ్జెట్ పెంచకుండా ఆసరా ఎలా సాధ్యమన్న ప్రశ్నకు జవాబు లేదని ఆమె చెప్పారు. పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఈ సర్కారుకు ప్రజల ఆసరా ఉండదని స్పష్టమవుతోందని హెచ్చరించారు.