కర్ణాటకలో కొన్ని ప్రాంతాలలో దేవాలయ ఉత్సవాలలో ముస్లింలను షాపులు ఏర్పర్చుకోకుండా నిషేధించడం పట్ల అధికార బిజెపిలోనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి జోక్యం చేసుకోవాలని, ఇటువంటి చర్యలు అంతర్జాతీయంగా హిందువుల మనుగడపై ప్రభావం చూపగలవని ఇద్దరు బిజెపి ఎమ్యెల్యేలు హెచ్చరించారు.
కొన్ని హిందూత్వ అనుకూల గ్రూపుల ఆదేశాల మేరకు దేవాలయాల ఉత్సవాల్లో పాల్గనకుండా ముస్లిం వ్యాపారాలపై ఆంక్షలు విధిస్తున్నారని ఎంఎల్సి ఎ.హెచ్. విశ్వనాథ్, ఎమ్మెల్యే అనిల్ బనేక్లు పేర్కొన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్ధం, తప్పుడు చర్యలు, పిచ్చితనంగా వారు స్పష్టం చేశారు.
విహెచ్పి, హిందూ జాగరణ వేదిక, భజరంగ్ దళ్, శ్రీరామసేన బృందాల డిమాండ్ మేరకు ఉడుపి, శివమొగ్గలో కొన్ని ఆలయ ఉత్సవాల్లో ముస్లింలు పాల్గనకుండా అడ్డుకుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయని హెచ్చరించారు.
అయితే హిందూ యేతరులు ఆలయాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా 2002లో కాంగ్రెస్ హయాంలోనే ఒక చట్టం రూపొందిందని, తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని బిజెపి ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకుంటోంది. ఇదంతా పిచ్చితనమని, దేవుడు, ఇతర మతాలు ఇటువంటి చర్యలను ప్రభోధించవని వారు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వం ఎందుకు ఈ విషయంపై మౌనం వహించిందో అర్థం కావడం లేదని ఆయన సొంత జిల్లా మైసూరులో మీడియాతో పేర్కొన్నారు. ఇంగ్లాండ్ చాలా మంది భారతీయులున్నారని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారతీయులు ఉన్నారని, ముస్లిం దేశాల్లోనూ భారతీయులు పనిచేస్తున్నారని .. వారంతా హిందువులకు వ్యతిరేకంగా చర్యలు చేపడితే ఏం చేస్తారని ప్రశ్నించారు.
పాకిస్తాన్, భారత్ విడిపోయినపుడు చాలా మంది ముస్లింలు భారత్లోనే ఉండేందుకు ఆసక్తి చూపారని, జిన్నా వెంట వెళ్లలేదని, ఆవిషయాన్ని గ్రహించాలని హితవు చెప్పారు. వారు కూడా భారతీయులేనని పేర్కొన్నారు.
కాగా, కాంగ్రెస్ మాజీ మంత్రి అయిన విశ్వనాథ్ 2019లో బిజెపిలో చేరారు. బిఎస్ యడియూరప్ప అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారు. అయితే ఆయనకు కేబినెట్ పదవి ఇచ్చేందుకు బిజెపి అధిష్టానం నిరాకరించింది.
ముస్లింలు అధికంగా ఉండే బెల్గావి ఉత్తర నియోజకవర్గానికి చెందిన బెనెక్ కూడా ఈ ఆంక్షలను వ్యతిరేకించారు. ముస్లిం వ్యాపారులపై ఆంక్షలు విధించడం సరికాదని తేల్చి చెప్పారు.