ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మహర్తం ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9.05 గంటల నుండి 9.45 గంటల మధ్య దీనికి సంబంధించి ప్రకటన వెలువడనుంది. రాష్ట్ర ప్రభత్వం ఈ మేరకు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలు కానున్నాయి.
బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సుస్ధిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.
పరిపాలనా సముదాయాలా నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపికను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని, అందులోనే కలెక్టరేట్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాన్ని కూడా ఉండేలా చూడాలని తెలిపారు. క్యాంపు కార్యాలయాలను అదే ప్రాంగణంలో ఉండాలని స్పష్టం చేశారు.
భవనాలకు మంచి డిజైన్లు చూడాలని. పదికాలాల పాటు అవి గుర్తుండాలని చెప్పారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికే 16,600 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, మార్పులు చేర్పులు చేశామని తెలిపారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తరువాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారని వివరించారు. సిబ్బంది విభజన, వారికి పోస్టిగుల్లో సిక్స్ పాయింట్ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. అనంతరమే కొత్త జిల్లాల పాలనాయంత్రాంగం, నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారు చేశామని చెప్పారు.
కొత్త జిల్లాలకు సంబంధించిన నూతన వెబ్సైట్లు, కొత్త యంత్రాంగాలు ఏర్పాటవుతున్నందున వాటికి అనుగుణంగా ప్రస్తుతం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు కూడా పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. 26 జిల్లాలకు సంబంధించిన సమాచారంతో కూడిన హ్యాండ్‌బుక్స్ కూడా తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సాధ్యమైనన్ని చోట్లా ప్రభుత్వ భవనాలు తీసుకున్నామని, లేనిచోట మాత్రమే ప్రైవేటు భవనాలు తీసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ డాక్టర్ సమీర్‌శర్మ, డిజిపి కె.వి.రాజేంధ్రనాథ్‌రెడ్డి, సిసిఎల్ఏ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాదు, జిఎడి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ప్లానింగ్ సెక్రటరీ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయకుమార్ తదిరులు పాల్గన్నారు.
కాగా, కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్లైన్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. 26 జిల్లాలు, 70 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించింది. వీటిలో 22 కొత్త రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ప్రజల నుండి వచ్చిన సూచనల మేరకు కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా చేశారు. 6వ తేదీన వాలంటీర్లకు సన్మానం, 8వ తేదీన వసతి దీవెన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.