సమాజంలో మహిళల పురోగతికి ప్రతికూలంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ – ఎఫ్ఎల్ఓ 38వ వార్షిక సదస్సుకు విశిష్ట అతిథిగా పాల్గొంటూ వివిధ రంగాల్లో లింగ వివక్షత పెను ప్రభావాన్ని చూపిస్తోందని.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతోపాటు పౌరసమాజం ప్రత్యేకమైన చొరవ తీసుకుని మహిళా సాధికారతకు బాటలు వేయాలని సూచించారు.
పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న తీరును ప్రత్యేకంగా అభిమానించిన ఉపరాష్ట్రపతి ఈ సంఖ్య మరింతగా పెరగాలని, శాసన వ్యవస్థలోనూ మహిళల భాగస్వామ్యానికి సరైన అవకాశం ఇవ్వాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. మహిళలను విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మరింతగా ప్రోత్సహించి వారికి సరైన సాధికారత కల్పించేదిశగా మరింత జరగాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
భారతదేశ జనాభాలో 49శాతంగా ఉన్న మహిళలను దేశ పురోగతిలోనూ క్రియాశీలక భాగస్వాములు చేసేందుకు చొరవతీసుకోవాలని కోరారు. లింగక వివక్షతను రూపుమాపడంతోపాటు బాలికల విద్యను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని విస్మరించకూడదని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సంస్థలు తమవంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు.
‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల వరకు సమర్థవంతంగా తీసుకెళ్లడంలో చొరవతీసుకోవాలని పేర్కొన్నారు. మహిళలకు విద్యనందించడం ద్వారా శిశు, మాతృమరణాలు తగ్గడంతోపాటు ఎన్నో ప్రయోజనాలను భారతీయ సమాజం అనుభవపూర్వకంగా తెలుసుకుందని చెప్పారు. విద్య ద్వారా కలిగే సాధికారతతో మహిళలు నిర్ణయాత్మక స్థాయికి ఎదుగుతారని తెలిపారు.
వ్యాపారంలో మహిళల భాగస్వామ్యం ఇటీవలి కాలంలో పెరుగతున్న విషయం దేశ పురోగతికి ఎంతో సానుకూల పరిణామమన్న ఉపరాష్ట్రపతి, దేశ జనాభాలో 49శాతంగా ఉన్న మహిళలు, 60శాతంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, దాదాపు 65 శాతంగా ఉన్న యువత (35 ఏళ్ల లోపు) వీరికి సరైన అవకాశాలు కల్పించినపుడే సమగ్ర పురోగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఎఫ్ఎల్ఓ చేస్తున్న కృషి అభినందనీయమని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ అధ్యక్షురాలు ఉజ్వల సింఘానియా, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు ఉమ చిగురుపాటి, నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు దాల్మియా, ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.