ఉపాధి హామీ పథకం నిధులపై కేంద్రం కోత విధించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం కింద దాదాపు రూ. 5,000 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందని, దీని వల్ల కార్మికులకు వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆమె తెలిపారు.
గురువారం లోక్సభ జీరో అవర్లో సోనియా గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కరోనా కాలంలో ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడిన ఉపాధి హామీ పథకానికి సమృద్ధిగా నిధులను కేంద్రం కేటాయించాలని, 15 రోజుల్లో కూలీలకు చెల్లింపులు జరిగేలా చూడాలని ఆమె కోరారు.
ఉపాధి హామీ పథకాన్ని కొందరు సభ్యులు ఎద్దేవా చేశారని, అయితే కరోనా కాలంలో కోట్లాది మందికి ఈ పథకమే సాయపడిందని ఆమె గుర్తు చేశారు. 2020 బడ్జెట్ కన్నా 35 శాతం తక్కువ కేటాయింపులు ఈ బడ్జెట్లో చేయడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా..కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ అధ్యక్షురాలి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని, ఆమె మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని వారు విమర్శించారు.