న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ (ఫాస్టర్) సాఫ్ట్‌వేర్‌ను గురువారం సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేలా రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రారంభోత్సవ ఆన్లైన్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్‌గుప్తా, పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. వేగంగా సాఫ్ట్వేర్ రూపొందించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు, కోర్టు రిజిస్ట్రీని అభినందించారు.
కోర్టు ఆమోదించిన బెయిల్, విడుదలకు సంబంధించిన ప్రోసీడింగ్స్, ఆదేశాలను ఈ–మెయిళ్ల ద్వారా వెంటనే సంబంధిత నోడల్ అధికారులకు చేరేలా ఈ సాఫ్ట్వేర్ చేస్తుందన్నారు. ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్ సంతకాలు, సంస్థాగత డిజిటల్ సంతకాలు ఉంటాయని పేర్కొన్నారు.
దీని ద్వారా కోర్టు ఉత్తర్వులను దేశంలోని అన్ని జిల్లాలకు చేరవేయడానికి వీలవుతుందని, ఇందుకోసం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో 73 మంది నోడల్ అధికారులను నియమించారని చెప్పారు. ఉత్తర్వులన్నింటినీ సురక్షితంగా పంపించడం కోసం నోడల్ అధికారులందర్నీ ప్రత్యేక జ్యుడీషియల్ కమ్యూనికేషన్ నెట్వర్క్(జేసీఎన్) ద్వారా అనుసంధానం చేసినట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలకు చెందిన 1,887 మంది అధికారుల ఈ-మెయిల్ ఐడీలను పొందుపరిచినట్టు చెప్పారు. వీటన్నింటినీ పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ప్రత్యేకంగా ‘ఫాస్టర్ సెల్’ ఏర్పాటు చేసినట్టు వివరించారు. కోర్టు ఆదేశాలను నోడల్ అధికారులకు పంపించే ఏర్పాట్లను ఇది చూసుకుంటుందని చెప్పారు.
ఈ ఉత్తర్వుల ప్రామాణికతను నిర్ధరించడానికి సుప్రీంకోర్టుకు చెందిన సంబంధిత నోడల్ అధికారులు, సంస్థకు చెందిన డిజిటల్ సిగ్నేచర్లు వాటిపై ఉంటాయని పేర్కొన్నారు. అందువల్ల సమయాన్ని వృథా చేయకుండా కింది స్థాయి వర కు ఉత్తర్వులు పంపించే వీలు కలిగిందన్నారు.
ప్రస్తుతం బెయిల్ మంజూరు, ఖైదీల విడుదల, కోర్టు కార్యకలాపాలకు చెందిన ఆర్డర్లు, రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్‌ను ఎలాంటి జాప్యం లేకుండా పంపించేందుకు ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రెండో దశలో మొత్తం కోర్టు ఉత్తర్వులు అన్నింటినీ పంపిస్తామని, అది కూడా సమీప భవిష్యత్తులోనే ఆచరణకు వస్తుందని తెలిపారు. అప్పుడు హార్డ్ కాపీలు పంపాల్సిన అవసరం ఉండదని చెప్పారు.