కేంద్రంలోని బీజేపీ వైఖరిని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ సమైక్యఫ్రంట్గా ఏర్పడాలని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపిచ్చారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలను విడిచిపెట్టి దేశాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.
మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాడులో డీఎంకేతో మైత్రి మాదిరిగానే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సూత్రప్రాయమైన మైత్రిని ఏర్పర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
‘భారతదేశం భిన్నత్వాన్ని, సమాఖ్య విధానం, లౌకికత, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం, రాష్ట్రాల హక్కులు, విద్యారంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాన్ని పక్కనబెట్టి ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి’అని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ పట్ల తమది వ్యక్తిగత ద్వేషం కాదని చెబుతూ అంశాల ప్రాతిపదికగానే బీజేపీ విధానాలను తాము విమర్శిస్తున్నామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో డీఎంకే ఎప్పుడూ కీలక భూమిక పోషిస్తూనే ఉందని తెలిపారు. పార్లమెంట్లో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీ అని గుర్తు చేశారు.
‘రాష్ట్రాల రాజకీయాలన్నీ కలిస్తేనే జాతీయ రాజకీయాలు. అంతే తప్ప, జాతీయ, రాష్ట్ర రాజకీయం అంటూ వేర్వేరుగా ఉండవు’ అని తెలిపారు. కాంగ్రెస్ బలహీనంగా మారినందున బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉండాలంటూ వస్తున్న వాదనపై ఆయన స్పందిస్తూ.. ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లో సరైనది కావచ్చు. కానీ, చాలా రాష్ట్రాల విషయంలో ఈ వైఖరి సరిపోదని స్పష్టం చేశారు.
“బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలి. మా రాష్ట్రంలో బీజేపీతో విభేదించే పార్టీలతో కూటమిగా ఏర్పడి, లౌకిక శక్తులను ఏకం చేశాం. కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇదే మైత్రితో వ్యవహరించాలి” అని స్టాలిన్ సూచించారు. ఇదివరకే, బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పిలుపివ్వడం గమనార్హం.
కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించక తప్పదు
ప్రతిపక్షాల ఐక్యత పిలుపును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ఆ పార్టీ ఉప నాయకుడు ఆనంద్ శర్మ ఆహ్వానించారు. అయితే.. భవిష్యత్తులో ప్రతిపక్షాలు సమైక్యమైన పక్షంలో కాంగ్రెస్ పార్టీయే పెద్దన్న పాత్ర పోషించక తప్పదని ఆయన స్పష్టం చేశారు.
బిజెపి లాంటి మత ఛాందసవాద శక్తిని ఎదిరించడానికి బిజెపియేతర నాయకులంతా కలసిరావాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీకి, ఇతర ప్రతిపక్షాలకు స్వల్ప అభిప్రాయభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మొదటి నుంచి తమ పార్టీ ప్రతిపక్ష ఐక్యతను కోరుతోందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఎన్నోసార్లు ఇదే విషయాన్ని నొక్కి చెప్పిందని, గతంలో కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్షాలను సంఘటితం చేయడానికి చొరవ తీసుకుందని ఆయన గుర్తు చేశారు. జాతీయ దృక్పథంతో ఆలోచిస్తే ప్రతిపక్షాల ఐక్య సంఘటనలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించక తప్పదని ఆయన చెప్పారు. చిత్తశుద్ధితో ప్రతిపక్ష ఐక్యతకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు.