రాష్ట్ర హైకోర్టు విధించిన ఆరు నెలల గడువులో రాష్ట్ర రాజధాని నగరం అమరావతిని అభివృద్ధి చేయడం సాధ్యం కాదని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ గడువును ఐదేళ్లకు పొడిగించాలని కోరుతూ హైకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది.
“ఆరు నెలల గడువులో రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం సాధ్యపడదు. రాజధాని నగర అభివృద్ధికి అవసరమైన రోడ్లు, విద్యుత్, తాగునీరు, మురుగు పారుదల తదితర మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలంటే కనీసం 60 నెలలు పడుతుంది” అంటూ అందులో స్పష్టం చేసింది.
రాజధాని నగరం, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంటూ అందువల్ల రాజధాని నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏకు అనుమతివ్వాలని విన్నవించింది. రాజధాని ప్రాంతం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని తెలుపుతూ అందువల్ల కాలం, నిధులు, అభివృద్ధి కోణంలో నిర్ణీత కాలంలో రాజధాని అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పడం సాధ్యం కాదని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఈ నేపథ్యంలో నిధుల లభ్యత, ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ హైకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. ‘‘రాజధాని అభివృద్ధి విషయంలో మార్చి 3న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నాం” అని తెలిపారు.
న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు ఉపయోగించుకొనే ముందు తీర్పు అమలులో ఉన్న సహేతుకమైన ఇబ్బందులు, అమలు సాధ్యం కాని పరిస్థితులను కోర్టు ముందు ఉంచేందుకు అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.42,231 కోట్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చామని తెలుపుతూ, నిధులు సమకూర్చుకునే విషయంలో ఆయా ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు ప్రాథమిక దశలో ఉన్నాయని తెలిపారు.
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొదటి దశ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయం రూ.51,687 కోట్లు. ఇందులో 2015 నుంచి 2019 వరకు ఇచ్చింది రూ.1,377 కోట్లే. 2020-2022 మధ్య కాలంలో రూ.1,646 కోట్లు ఇచ్చారు. సీఆర్డీఏ రుణం ద్వారా రూ.5,122 కోట్లు సేకరించారని వివరించారు.
మరోవంక, మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రాజధాని నగర అభివృద్ధికి అవసరమైన రూ.3000 కోట్లు రుణం పొందేందుకు సీఆర్డీఏకు ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇచ్చినా సీఆర్డీఏ నిధులు సమీకరించలేకపోయింది. ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధుల కొరతను అధిగమించేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది.
ఏపీ పునర్విభజన చట్టం మేరకు రాజధాని ప్రాంతంలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణం కోసం కేంద్రం నిధులు సమకూర్చాలి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2014-17 మధ్యకాలంలో రూ.1,500 కోట్లు ఇచ్చింది. వీటి కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,632.48 కోట్లు ఖర్చు చేసింది. రూ.3,023 కోట్ల నిధులను గ్రాంటుగా ఇచ్చింది.
గతంలో ఇచ్చిన అంచనాలు ప్రస్తుతం పెరిగే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతం అభివృద్ధికి రూ.1.9 లక్షల కోట్లు అవసరమవుతాయని 2018లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అందులో రూ.62,625 కోట్లకు డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ డీపీఆర్‌లపై స్పష్టత కోరింది. కేంద్ర ప్రభుత్వం సందేహాలు నివృత్తి చేసే పనిలో రాష్టప్రభుత్వం ఉంది’’ అని అఫిడవిట్లో పేర్కొంది.
భూ యజమానులకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్న మొత్తం 22,276 పునర్నిర్మాణ ప్లాట్లలో 17,357 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేందుకు అర్హత కలిగి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సంబంధిత యజమానులను అధికారులు కోరారు. మిగిలిన 4,919 ప్లాట్లలో 1598 ప్లాట్ల వ్యవహారంలో వివిధ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
భూసమీకరణ విధానంలోని రూల్ 12 ప్రకారం తుదినోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి మూడేళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి చేసి ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ గడువును 2024 జనవరి వరకు పొడిగిస్తూ 2020లో తీర్మానం చేశారని అఫిడవిట్లో వివరించారు.