బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడిచేసి, 150 మందిని పైగా అదుపులోకి తీసుకొని, పెద్ద ఎత్తుగా డ్రగ్ లను స్వాధీనం చేసుకోవడం ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ప్రాధమికంగా అర్ధరాత్రి దాటిన తర్వాత, ఉదయం 3 గంటల ప్రాంతంలో కూడా పబ్ పనిచేస్తుండడంతో దాడి చేసిన పోలీసులు, అక్కడ ప్రముఖ సెలబ్రేటీలు, వారి కుటుంభం సభ్యులు ఉండడంతో సంచలనం కలిగించింది.
రాడిసన్ పబ్‌లో డ్రగ్స్ బయటపడ్డాయి. పోలీసుల దాడుల్లో 6 గ్రాముల కొకైన్ ను గుర్తించారు. దీంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల దాడులతో బెంబేలెత్తిన యువకులు పరుగులు తీశారు. పబ్‌లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ పడేశారు. బాత్ రూమ్, డ్యాన్స్ ఫ్లోర్లలో డ్రగ్స్ ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నారు.
హోటల్లో భాగంగా ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్‌లో పార్టీ జరుగుతున్నదని, అందులో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పబ్‌ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 39 మంది యవతులు, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉన్నారు.
డ్రగ్స్ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల దాడిలో దొరికిన 45 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నామని, వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ తెలిపారు. అదే విధంగా ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్ మెమో జారీ చేశామని కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
మరో పక్క డ్రగ్స్ కేసు దర్యాప్తు, పబ్‌లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, ఇతర వస్తువులతో పాటు లభించిన సమాచారంపై ఆనంద్ సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. కేసును అన్ని రకాలుగా విచారించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా శాస్త్రీయంగా కూడా విశ్లేషించాలని అధికారులకు సీపీ సూచించారు.
ప్రముఖుల పిల్లలున్నందున కేసును పక్కదారి పట్టించే అవకాశాలున్నాయన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని, వీటన్నింటినీ పటా పంచలు చేసి దోషులు ఎవరుంటే వారిపై చర్యలు తీసుకునేలా దర్యాప్తు జరపాల్సిందని అధికారులను సీపీ ఆదేశించారు.
టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ మాదక ద్రవ్యాలు, అక్రమ డ్రగ్స్‌కు కేంద్రంగా మారుతోందన్న తమ ఆరోపణలను స్పష్టం చేస్తున్నట్లు బిజెపి ఆరోపించింది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడం, నగరాన్ని నార్కోటిక్ సూపర్ మార్కెట్‌గా మార్చడానికి ప్రత్యక్ష మార్గం సుగమం చేసిందని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు స్పష్టం చేశారు.
బంగారు తెలంగాణ అని గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంగా మారుస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. అర్ధరాత్రి 3గంటల వరకు పబ్ లు నడుస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాకు కేటీఆర్ కు ఉన్నదని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలే డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్నారని స్పష్టం చేశారు.