రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రతిపక్షాలు, విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. ధరలపై చర్చ నడపాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనలతో సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నాయి.
సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చించాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశమిస్తామని డిప్యూటీ ఛైర్మన్ సస్మిత్ పాత్ర చెప్పినా వినకుండా విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో ఆయన సభను 2 గంటల వరకు వాయిదా వేశారు..
వెల్‌లోకి దూసుకెళ్లిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో రెండు సార్లు రాజ్యసభ వాయిదా పడింది. అయినప్పటికీ సభ అదుపులోకి రావకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. అంతకు ముందు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలని విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు.
కాగా, పెట్రో అంశంపై లోక్‌సభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వెల్‌లోకి దూసుకువెళ్లిన డీఎంకే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, శివసేన పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు.
ప్రధాని జన్ ధన్ లూట్ యోజన.. రాజీవ్ ఎద్దేవా
పెరుగుతున్న చమురు ధరలపై కాంగ్రెస్ కేంద్రంపై ధ్వజమెత్తింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిని ‘ ప్రధాన మంత్రి జనధన్ లూట్ యోజన’ అని ఎద్దేవా చేశారు. బైక్, కారు, ట్రాక్టర్ ఫుల్ ట్యాంక్ నింపిస్తే 2014తో పోలిస్తే నేడు ఎంత ఖర్చయిపోతుందన్నది ఆయన చిత్రాల ద్వారా ట్విట్టర్ లో తెలిపారు.
రాహుల్ విడుదల చేసిన గ్రాఫిక్ లెక్కల ప్రకారం 2014లో స్కూటర్/బైక్ ఫుల్ ట్యాంక్ ఇంధనం ధర రూ.714. అది ప్రస్తుతం రూ.1,038కి చేరింది. కారు ఫుట్ట్యాంక్ ధర అప్పట్లో రూ.2.856, ప్రస్తుతం రూ.4,141. ట్రాక్టర్ ఫుల్ ట్యాంక్ ఇంధనం ధరం అప్పట్లో రూ.2,749, ప్రస్తుతం రూ.4,563. దీనిని ”ప్రధాన్ మంత్రి జన్ థన్ లూట్ యోజన”గా రాహుల్ ఆ ట్వీట్లో అభివర్ణించారు.
ఇదిలావుండగా, నరేంద్ర మోదీ పాలనలో ప్రతి ఉదయం వేధనే తీసుకొస్తుందే తప్ప ఆనందం కాదని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ‘ఈ రోజు ఉదయం కూడా ఇంధనం లూటీ లీటరు పెట్రోల్, డీజిల్ రూ. 0.40 పెరిగింది’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. సిఎన్ జి కిలో రూ. 2.50 మేరకు పెరిగింది.
ఇక రెండు వారాల్లో లీటరు పెట్రోల్/డీజిల్ ధర రూ. 8.40 చొప్పున పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ‘బిజెపికి ఓటేయ్యడం అంటే ద్రవ్యోల్బణానికి ఓటేయ్యడమే’ అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో పెట్రోల్ లీటరు రూ. 103.41 నుంచి రూ. 103.81కి పెరిగింది. కాగా డీజిల్ లీటరుకు రూ. 94.67 నుంచి రూ. 95.07కు పెరిగింది. నాలుగున్నర నెలల్లో ఇలా ఇంధన ధరలు పెరుగడం 12వ సారి.
అఖిల పక్షం సమావేశంకు మమతా డిమాండ్
ఇంధనం ధరలు చుక్కలను తాకుతుండటంపై బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రసుతం కొనసాగుతున్న ‘ఆర్థిక సంక్షోభం’పై చర్చించి, ఒక పరిష్కారం కనుగొనేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బీజేపీయేతర రాష్ట్రాల్లో ఆ పార్టీ జరుపుతున్న ‘దౌర్జన్యాల’ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పెట్రోల్, డీజిల్ ధరల తీవ్ర పెంపును కేంద్రం అనుమతిస్తోందని ఆమె ఆరోపించారు. ”ఇంధనం ధరల పెరుగుదలను ఎదుర్కొనే వ్యూహం ఏదీ కేంద్రం వద్ద లేదు. ఈ సంక్షోభానికి బీజేపీనే కారణం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది” అని ఆమె ఎద్దేవా చేశారు.
విపక్ష పార్టీలపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడానికి బదులు ప్రస్తుత ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేయడం తప్పనిసరని ఆమె స్పష్టం చేశారు.