అమెరికా, యూరప్ వంటి ఇతర దేశాల్లో వినియోగిస్తున్న టీకాల కన్నా మన దేశంలో మన టీకాలు చాలా ఉత్తమమైనవని రుజువైందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అధర్ పూనావాలా వెల్లడించారు. ఆయా దేశాల్లో చాలా ఎక్కువగా కేసులు పెరుగుతుండగా, మనదేశంలో చాలా తక్కువగా కేసులు ఉంటున్నాయని, దీనికి కారణం సరైన టీకాలను మనం ఎంచుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ ఇంధనం అనే అంశంపై సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా ఉండడానికి సరైన టీకాను ఎంచుకోవడమే కారణమని చెప్పారు. ఒకవేళ నాలుగో వేవ్ సంభవిస్తే అది చాలా మాంద్యంగా ఉంటుందని తెలిపారు.
బూస్టర్ డోసు గురించి మాట్లాడుతూ ఎవరైతే విదేశాలకు పర్యటిస్తారో వారికి బూస్టర్ డోసు తప్పనిసరి అని, అందువల్ల ప్రతివారికి బూస్టర్ డోసు ఇవ్వడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనిపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చిస్తోందని పేర్కొంటూ త్వరలో బూస్టర్ డోసుపై ఒక విధానం వెలువడుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.
ఇతర దేశాలు బూస్టర్ డోసును వినియోగిస్తున్నాయని, భారత్ కూడా దీని గురించి ఆలోచించవలసిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు. అర్హులైన వయోజనులందరికీ చాలావరకు రెండు డోసులు అందించడంలో కేంద్రం అద్భుతంగా పనిచేసిందని ఆయన ప్రశంసించారు.
ప్రస్తుతం వాడుకలో ఉన్న టీకాలు కొత్త వేరియంట్లను కట్టడి చేయగలవా అని ప్రశ్నించగా, బూస్టర్ డోసు తీసుకుంటేనే అవి పనిచేయగలవని వివరించారు. భవిష్యత్తులో వచ్చే వేరియంట్ల నుంచి కూడా రక్షణ కలుగుతుందని భరోసా ఇచ్చారు.