గత కొన్ని సంవత్సరాలుగా మరుగున పడిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తెచ్చేందుకు తృణమూల్ కాంగ్రెస్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని కోరుతోంది.
సోమవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చామని టిఎంసి రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ తెలిపారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ ఏనాటి నుంచో ఉంది. అయితే బిల్లు రూపం నుంచి చట్ట రూపం దాల్చడం లేదు. అప్పుడప్పుడు ఈ విషయమై రాజకీయ చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. కానీ చర్చ చట్టాన్ని చేరడం లేదు.
ప్రజా ప్రయోజన సమస్యల్ని లేవనెత్తే అవకాశమున్న రూల్ 168 కింద ఓబ్రియన్ ఈ నోటీసు ఇచ్చారు. ఈ బిల్లును ఏప్రిల్ 8న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నామని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించి, ఓటు వేయమని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అన్ని ప్రధాన పార్టీల మహిళా ఎంపీల పర్సంటేజ్‌ల వివరాలను ఆయన వెల్లడించారు.
టిఎంసీలో 37 శాతం మహిళా ఎంపీలు ఉన్నారని, అధికార బిజెపిలో మాత్రం కేవలం 13 శాతం మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారని ఆయన తెలిపారు. బీజేపీకి నిబద్ధత ఉంటే మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టి ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ప్రధానంగా లోక్‌సభలోనూ, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని ఈ బిల్లు ఉద్దేశం. మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు తొలిసారిగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
ఆ తర్వాత 1988, 1999, 2008లో మూడుసార్లు ప్రవేశపెట్టారు. 2008లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై స్టాండింగ్ కమిటీ పరిశీలన తర్వాత 2010లో రాజ్యసభలో ఆమోదించి. లోక్‌సభకు పంపారు. అయితే 2014లో 15వ లోక్‌సభ ముగియడంతో ఆ బిల్లు రద్దయింది. తాజాగా ఇప్పుడు ఈ బిల్లుకు టిఎంసి ముందుకు తెచ్చింది.