డ్రక్స్ కల్చర్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలదేనని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాడిసన్ పబ్ ఘటనలో రెండు జాతీయ పార్టీల నేతల పిల్లలే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
డ్రగ్స్ వాడుతూ పబ్ లో దొరికిన వారిలో ఒకరేమో బీజేపీ ప్రముఖ నాయకురాలి కుమారుడని, మరొకరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేనల్లుడిని వివరించారు. ఇంకా కొంతమంది నాయకుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. పబ్ ఓనర్ అభిషేక్ బీజేపీ నేత ఉప్పల శారద కొడుకని తెలిపారు. ఆమె 2018 ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేశారు.
ఈ ఘటనతో బీజేపీ, కాంగ్రెస్ నేతల చిల్లర వ్యవహారాలు బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు. డ్రగ్స్ అమ్మేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహితులేనని, కేసు దర్యాప్తు పూర్తయితే మరిన్ని పేర్లు, కీలకమైన విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ బీజేపీ నాయకుల కుటుంబ సభ్యులు డ్రగ్స్ కు అలవాటు పడ్డారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరిని బొంద పెడుతాడో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. డ్రగ్స్ సప్లయిర్స్తో పాటు వాడకందార్లను అరెస్టు చేస్తున్నామని చెబుతూ తమకు చిత్తశుద్ధి లేకుంటే ఇంత మందిని అరెస్టు చేస్తామా అని ప్రశ్నించారు.
మాదకద్రవ్యాలపై కేసీఆర్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలు హస్తం ఉందన్న బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సిగ్గు ఉండాలని మండిపడ్డారు. ప్రతి చిన్న విషయాన్ని టీఆర్ఎస్కు ఆపాదించడం రెండు పార్టీలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పేకాట క్లబ్ లు మూసి వేశామని చెబుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ పలు సమీక్షలు జరిపారని ఆయన తెలిపారు.
హైదరాబాద్లో పేకాట క్లబ్లు గతంలో ఉన్నవి అంటే అవన్నీ కాంగ్రేస్ నేతలవేనని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరికి నీతులు చెప్తారో మరి అని ఆయన ఎద్దేవా చేశారు.