ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పార్టీలో అందరికి దిగ్భ్రాంతిని, నిరాశను కలిగించినట్లు తనకు తెలుసని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొదటిసారిగా అంగీకరించారు. మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో మాట్లాడుతూ ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విధాలా కృషిచేస్తున్నట్టు పార్టీ నేతలకు ఆమె భరోసా ఇచ్చారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతికరమైనవి, బాధాకరమైనవి అని అభివర్ణిస్తూ పార్టీకి ముందున్న మార్గం మునుపెన్నడూ లేనంత సవాలుగా ఉంది, ఇది పార్టీ అంకితభావం, దృఢ సంకల్పం, స్ఫూర్తిని పరీక్షించగలదని ఆమె చెప్పారు.
ఆమె జి-23 నాయకుల వ్యాఖ్యలను లేదా అనేక పలు రాష్ట్రాలలో జరుగుతున్న తర్జనభర్జనలని పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీలో ఐక్యతను కాపాడడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందుకోసం అన్ని స్థాయిలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపిచ్చారు.
కాంగ్రెస్‌కు పూర్వవైభవం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నామని హామీ ఇచ్చారు. తమ పనితీరును సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైందని, పార్టీలోని ఇతర సభ్యులను కూడా కలిశామని ఆమె గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం తనకు ఎన్నో సూచనలు అందాయని.. వాటిపై పని చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ శ్రేణుల దృఢ సంకల్పానికి ఇది పరీక్షా సమయమని చెబుతూ ప్రజాస్వామ్యం, సమాజానికి కాంగ్రెస్ పునరుజ్జీవనం అవసరమని సోనియా స్పష్టం చేశారు.
“ఇటీవలి ఎన్నికల ఫలితాలతో మీరు ఎంత నిరాశకు లోనయ్యారో నాకు బాగా తెలుసు. అవి షాకింగ్, బాధాకరమైనవిగా ఉన్నాయి. మన పనితీరును సమీక్షించేందుకు సిడబ్ల్యుసి ఒకసారి సమావేశమైంది. నేను ఇతర సహచరులను కూడా కలిశాను. మన సంస్థను ఎలా బలోపేతం చేయాలనే దానిపై నాకు చాలా సూచనలు వచ్చాయి. అవి చాలా సంబంధితమైనవి, పైగా నేను వాటిపై పని చేస్తున్నాను ” అని ఆమె తెలిపారు.
‘చింతన్ శిబిర్’ను నిర్వహించడం కూడా చాలా అవసరమని ఆమె చెబుతూ “అక్కడే పెద్ద సంఖ్యలో సహచరులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలు వినబడతాయి. మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా ఉత్తమంగా ఎదుర్కోవాలనే దానిపై మన పార్టీ తీసుకోవలసిన అత్యవసర చర్యలపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ముందుకు తీసుకురావడానికి వారు సహకరిస్తారు” అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
సోనియా గాంధీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) – ప్రభుత్వ విధానాలు, అధికార పార్టీ ‘విభజన, ధ్రువణ ఎజెండా’పై ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు, నాయకులు, కార్మికులపై ప్రభుత్వం దాడులు కొనసాగిస్తోందని ఆమె అన్నారు.
ఇటీవల కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె , వారు లేవనెత్తిన సమస్యలను ఆమె ప్రస్తావిస్తూ, ‘పెరుగుతున్న నిరుద్యోగం , జీవనోపాధి అభద్రత సమయంలో కార్మిక చట్టాలు పలుచన చేయబడ్డాయి. ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉపాధికి ఒక ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు ‘ఆస్తి మానిటైజేషన్’ అనే ఫాన్సీ పేరుతో విక్రయించబడుతున్నాయి. డీమోనిటైజేషన్‌గా మారిన తర్వాత ఇది మరో విపత్తు కాగలదు’ అని సోనియా గాంధీ హెచ్చరించారు.