భారత దేశంలో తలెత్తిన హిజాబ్ వివాదంను ఇస్లాంపై జరుగుతున్న దాడిగా అంతర్జాతీయ తీవ్రవాద ఇస్లాం సంస్థలు అభివర్ణిస్తున్నాయి. దీనిపై పోరాడాలి అంటూ భారత్ లోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా, అల్ ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహిరి యుద్ధ రంగంలో ఆయుధాలతో తెలివిగా పోరాడాలని అంటూ ఓ వీడియో ద్వారా పిలుపిచ్చారు.
దానితో ఇప్పటి వరకు మృతి చెందినట్లు భావితున్న ఆయన సజీవంగానే ఉన్నట్లు రుజువవుతోంది. 2020లో ఆయన సహజ కారణాలతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. జవహిరి వీడియోను అల్ ఖైదా మీడియా పోస్ట్ చేసింది.
కర్ణాటకలో హిజాబ్ వివాదం సందర్భంగా కొందరు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేస్తుండగా, ముస్కాన్ ఖాన్ అనే ముస్లిం విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అని నినదించడాన్ని జవహిరి ఈ వీడియోలో ప్రశంసించాడు. ఆమె తక్బీర్ నినాదాన్ని సాటిలేని రీతిలో వినిపించిందని కొనియాడాడు.
హిందూ బహుదేవతారాధకులను ఆమె సవాలు చేసిందని అభినందించాడు. ఆమె నినదించడంతో జీహాద్ స్ఫూర్తి మరింత బలోపేతమైందని, ముస్లింలను మేల్కొలిపిందని చెప్పాడు. జవహిరి విడుదల చేసిన వీడియో నిడివి సుమారు తొమ్మిది నిమిషాలు ఉంది. దీనిలో ప్రారంభంలో ముస్కాన్ ఖాన్ నినాదాలు చేసిన వీడియోను పెట్టారు.
ఆ తర్వాత జవహిరి ప్రసంగం కనిపిస్తోంది. ముస్కాన్ వాస్తవాలను బయటపెట్టిందని అంటూ నిరాడంబరులు, స్వచ్ఛమైనవారు అయిన ముస్లిం సమాజానికి, నైతికంగా దిగజారిన, నీతిబాహ్యులైన బహు దేవతారాధకులు, నాస్తిక శత్రువులకు మధ్య జరుగుతున్న సంఘర్షణ స్వభావాన్ని ఆమె బయటపెట్టిందని పేర్కొన్నాడు.
నైతికంగా, సాంస్కృతికంగా దిగజారిన పాశ్చాత్య ప్రపంచానికి సంబంధించిన ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్న ముస్లిం మహిళలకు ఆచరణాత్మకంగా ఓ పాఠం చెప్పినందుకు ముస్కాన్ ఖాన్‌కు అల్లా గొప్ప పురస్కారాన్ని ఇస్తాడని చెప్పాడు. హిందూ ఇండియా నిజస్వరూపాన్ని, దాని పాగన్ డెమొక్రసీ మోసకారితనాన్ని బయటపెట్టినందుకు ఆమెకు అల్లా గొప్ప పురస్కారాన్ని ఇస్తాడని తెలిపాడు.
ఆమె తక్బీర్ తనను కొన్ని వాక్యాలతో కూడిన పద్యాన్ని రాసేలా ప్రేరేపించిందని చెబుతూ తాను కవిని కాకపోయినప్పటికీ పద్యం రాసే విధంగా ఆమె చర్య తనను ప్రోత్సహించిందని అభినందించాడు. తన మాటల బహుమతిని తమ గౌరవప్రదమైన సోదరి అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఇండియా హిందూ డెమోక్రసీ ఎండమావిని చూసి మోసపోవడం ఆపాలని ముస్లింలకు పిలుపునిచ్చాడు. ఇది ఇస్లాంను అణచివేయడానికి ఉపయోగించే సాధనం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశాడు. ఈ వాస్తవ ప్రపంచంలో మానవ హక్కులు, లేదా, రాజ్యాంగం/చట్టాన్ని గౌరవించడం లేదా అటువంటి అర్థరహిత ఊహాజనిత భావాల వంటివేమీ లేవని మనం తెలుసుకోవాలని సూచించాడు.
పాశ్చాత్య దేశాలు ముస్లింలపై ఇటువంటి మోసపూరిత పథకాన్నే అమలు చేశాయని ధ్వజమెత్తాడు. ఫ్రాన్స్, హాలండ్, స్విట్జర్లాండ్ బహిరంగ నగ్నత్వాన్ని అనుమతిస్తూ హిజాబ్‌ను నిషేధించడం ద్వారా ఈ నిజ స్వరూపాన్ని బయటపెట్టాయని పేర్కొన్నాడు. ఇస్లాంకు శత్రువులంతా ఒకే విధంగా ఉంటారని స్పష్టం చేశాడు.
ఈజిప్టు, మఘ్రెబ్ ప్రాంతాల్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారంతా ఒకే రకమైన అవకాశవాద దౌర్జన్యకారులని పేర్కొన్నాడు. రచయితలు, పాత్రికేయులను అవకాశవాద దౌర్జన్యకారులుగా అభివర్ణించాడు.
వీరు తలపాగాలను అద్దెకు తెచ్చుకుని, హిజాబ్‌ను, షరియా చట్టాన్ని చులకనగా రాస్తున్నారని, మాట్లాడుతున్నారని మండిపడ్డాడు. ఇదంతా ఇస్లాంపై యుద్ధమని, ఇస్లాం మౌలిక సిద్ధాంతాలు, చట్టాలు, సంప్రదాయాలపై యుద్ధమని చెప్పాడు.
భారత ఉపఖండంలోని ముస్లిం సమాజం పోరాడుతోందని, అవగాహన కోసం యుద్ధం చేస్తోందని, వాస్తవాల నుంచి భ్రమలను వేరు చేసేందుకు పోరాడుతోందని చెప్పాడు. ఇప్పుడు ముస్లింలకు ఉన్న మార్గం గురించి వివరిస్తూ, షరియాకు కట్టుబడి ఉండాలని, ఏకైక సమాజంగా ఏకం కావాలని చెప్పాడు.
చైనా నుంచి ఇస్లామిక్ మఘ్రెబ్ వరకు, కాకసస్ నుంచి సోమాలియా వరకు, సమైక్య సమాజంగా అనేక రూపాల్లో సమష్టి యుద్ధం చేయాలని తెలిపాడు. నిజాయితీగల స్కాలర్స్‌ను చేర్చుకుని, సైద్ధాంతికంగా యుద్ధం చేయాలని చెప్పాడు. ఇస్లాంకు శత్రువులకు వ్యతిరేకంగా మీడియాను, యుద్ధ రంగంలో ఆయుధాలను ఉపయోగించుకుంటూ, మేధాశక్తితో యుద్ధం చేయాలన్నాడు.
ముస్కాన్ ఖాన్ వీడియోను వైరల్ చేసిన ‘‘ఫ్రీ మీడియా’’ను జవహిరి ప్రశంసించాడు. జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని, అణచివేతను ఎదుర్కొనాలని పిలుపునిస్తున్నానని చెప్పాడు. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను విస్తృతంగా తెలియజేయాలని చెప్పాడు.
కాగా, గత నెలలో ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థల ప్రచార మాధ్యమాల్లో కవర్ స్టోరీలు వచ్చాయి. అదేవిధంగా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ మ్యాగజైన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’లో కూడా కవర్ స్టోరీ వేశారు. ఉర్దూ మ్యాగజైన్ నవా-ఈ-ఘజ్వా-ఈ- హింద్ కూడా దీనిపై ఓ వ్యాసాన్ని ప్రచురించింది.