రానున్న కాలంలో ఆర్ఎస్ఎస్, బిజెపిని ఒంటరి చేసి ఓడించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ పిలుపిచ్చారు. కేరళలోని కన్నూర్ లో సిపిఎం 23వ అఖిల భారత మహా సభల సందర్భంగా ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఆర్ఎస్ఎస్, బిజెపిని ఓడించేందుకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఆర్ఎస్ఎస్, బిజెపిని ఒక్క రాజకీయ రంగాల్లోనే కాకుండా, సైద్ధాంతిక, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ఒంటరిని చేయాలని దిశానిర్ధేశం చేశారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ 23వ పార్టీ మహా సభల్లో చర్చిస్తామని చెప్పారు. హిందూత్వ ఎజెండాకు వ్యతిరేకంగా పోరాటాలను బలపరిచే విధంగా.. మహాసభ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
దేశంలో లౌకికత్వ పరిరక్షణ కోసం ఉధృతంగా.. రాజీలేని పోరాటాలు చేయటం ద్వారానే హిందూ మతోన్మాదానికి అడ్డుకట్ట వేయగలమని ఏచూరి స్పష్టం చేశారు. ఆ పోరాటాలకు సిపిఎం, వామపక్షాలు నాయకత్వ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వామపక్షాల నాయకత్వంతో కూడిన అలాంటి పోరాటాలే మతోన్మాదానికి నిజమైన విరుగుడని ఆయన పేర్కొన్నారు.
అందులో భాగంగా ముందుగా సిపిఎం స్వతంత్ర శక్తిని పెంచుకోవడంపై అధిక దృష్టిని పెట్టాలని ఏచూరి సూచించారు. వర్గ, ప్రజా పోరాటాలను నిర్మించడం ద్వారా వామపక్ష శక్తుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
సిపిఎం తమ బలాన్ని పెంచుకొని పీడిత ప్రజల కోసం పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలన్నీ లౌకికత్వాన్ని రక్షించటంలో తామెలాంటి విధానాన్ని అవలంబిస్తున్నాయో, ఎటువైపు నిలబడుతున్నాయో పరిశీలించుకోవాలని హితవు పలికారు.
భారత పాలక వర్గాల విధానాలకు ప్రత్యామ్నాయ కార్యక్రమంతో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతను సాధించాలని చెప్పారు. హిందూత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా బిజెపిని ఓడించేందుకు విస్తృత స్థాయిలో అన్ని లౌకిక శక్తుల కలిసిన వేదికను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరెస్సెస్ ఆదేశాలకు అనుగుణంగా మరింత దూకుడుగా హిందూత్వ అజెండాను అమలు చేస్తోందని ఏచూరి తెలిపారు. అలాగే సరళీకృత ఆర్థిక విధానాలను గతం కన్నా రెట్టింపు వేగంతో అమలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదం, కార్పొరేట్ విధానాలను ఒక గొలుసులాగా కలిపి అమలు చేస్తోందని తెలిపారు.
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో ప్రభుత్వరంగ సంస్థలను యథేచ్ఛగా అమ్ముతున్నదని, అదే సమయంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ… దానికి పునాదులైన లౌకిక ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన అనే మౌలికాంశాలకు తూట్లు పొడుస్తున్నదని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, సిబిఐ, ఈడీ తదితరాలకు ఉన్న స్వతంత్రను భంగపరుస్తూ వాటిని తన అధీనంలోకి తెచ్చుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవాళ మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోరాటం, కేరళ లోని సిపిఎం ప్రభుత్వం లౌకికవాదాన్ని రాజీ లేకుండా నిలబెట్టడం ద్వారా మార్గాన్ని చూపిందని ఏచూరి కొనియాడారు. నేడు ప్రపంచం కేరళ ఉన్నతస్థాయి మానవాభివృద్ధి సూచికలను ప్రశంసిస్తోందని గుర్తు చేశారు. ఐదు రోజుల పార్టీ కాంగ్రెస్ రాబోయే మూడేళ్లలో పార్టీ రాజకీయ దిశను నిర్దేశిస్తుందని చెప్పారు.
తొలుత సీనియర్ నాయకులు రామచంద్ర పిళ్లై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు ఫాసిజం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని చెప్పారు.
మహాసభ ఈ అంశాలను చర్చించి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సిపిఎం చరిత్రలో ఈ మహాసభ మైలు రాయిగా నిలుస్తుందని చెప్పారు. మార్క్సిజాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు. అనంతరం మహాసభల ప్రతినిధులు అమరవీరులకు నివాళలు అర్పించారు.
బుధవారం నుండి ఆదివారం జరిగే మహాసభలలో దేశం నలుమూలల నుండి దాదాపు 900 మంది ప్రతినిధులు హాజరౌతున్నారు. ఈ మహాసభలకు సిపిఎం అగ్రనాయకత్వం సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, మాణిక్ సర్కార్, బృందా కరత్, సుభాషిణి అలీ, పినరయి విజయన్, బివి రాఘవులతోపాటు పలువురు హాజరౌతున్నారు.