టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా అని, దొంగల ముఠా హైదరాబాద్లో ఉంటూ వైసిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారి పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం ఆయన పర్యటించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని ధ్వజమెత్తారు.
చంద్రబాబు గతంలో ఎపిని దోచుకుని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. రెండు రోజుల క్రితం తాను ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నప్పుడు ఆయన తనకు క్లాస్ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. తాను ప్రధాని మాత్రమే ఆ గదిలో ఉన్నామని చెబుతూ వీళ్లు ఆ గాడిలో సోఫా కింద ఉండి విన్నారా? అని ఎద్దేవా చేశారు.
మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, ఎల్లో మీడియా ముసుగులో ఉన్నవారంతా దొంగల ముఠానే అని సీఎం జగన్ దయ్యబట్టారు. డిపాజిట్లు కూడా దక్కని బాధ, ఏడుపు టిడిపిదని, ఏ పార్టీతో కావాలంటే ఆ పార్టీతో కలుస్తారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోతారని, చుట్టం వచ్చినట్లు రాష్ట్రానికి వచ్చివెళ్తారని అంటూ సీఎం జగన్ విమర్శించారు.
చంద్రబాబు – పవన్ బంధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారని చెప్పారు. తమకు ఇష్టంలేని పార్టీ ప్రభుత్వంలో ఉంటే.. కలిసి పోటీచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తారని మండిపడ్డారు. వారిది దొంగల ముఠా అని, అధికారం తప్ప వేరే ఎజెండా లేదని ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.