ఆంధ్ర ప్రదేశ్ లో ఒక వంక జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బిజెపి ఆ పార్టీకి చెందిన మాజీ సీనియర్ నేత ఒకరిని తమ పార్టీలో చేర్చుకొంది. జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని గత నెలలో పిలుపు ఇవ్వడం ద్వారా జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడిగా పోటీచేయాలని పరోక్షంగా పవన్ కళ్యాణ్ సంకేతం ఇచ్చినప్పటి నుండి రాష్ట్ర బిజెపి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తమకు కేవలం జనసేనతో మాత్రమే పొత్తు అని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమనడం ద్వారా జనసేన టిడిపితో కలిస్తే తమ దారి తాము చూసుకొంటామనే స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా చేరిక ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా హెచ్చరికగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
జనసేన మాజీ సీనియర్ నాయకుడు మారిశెట్టి రాఘవయ్య బిజెపిలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. పురందేశ్వరి, సోము వీర్రాజు సమక్షంలో రాఘవయ్య బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. శ్రీకాకుళంలో నీటి సమస్యల పరిష్కారం కోసం బిజెపి చేపట్టిన ఉత్తరాంధ్ర జన పోరు యాత్రకు హాజరైన మారిశెట్టి రాఘవయ్య ఆ తర్వాత తన అనుచరులతో కలిసి ఆ పార్టీలో చేరారు.
రాఘవయ్య మూడేళ్ల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసి, ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలను పదే పదే కొనియాడుతూ వస్తున్నారు. తాను పార్టీకి రాజీనామా చేసినప్పుడు జనసేన బీజేపీకి మిత్రపక్షం కాదని, మూడేళ్ల క్రితం రాజకీయాలకు దూరంగా ఉండాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు.
అయితే, తన రాజకీయ యాత్రను కొనసాగించాలని భావించిన ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాట్లు తెలిపారు. గతంలో ప్రజారాజ్యం, జనసేన పార్టీలతో కలిసి పనిచేసిన రాఘవయ్య గతంలో బీజేపీలో కూడా పనిచేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో, రాఘవయ్య 2019 వరకు పార్టీ కోశాధికారిగా ఉన్నారు. ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉన్నారు.
2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అందులో కీలకంగా వ్యవహరించారు. ఆ పార్టీని ఎన్నికల కమీషన్ వద్ద నమోదు చేయడం అంతా ఆయనే చూసారు.