రాష్ట్ర ప్రభుత్వం తనను తరచూ అవమానాలకు గురిచేస్తున్నదని , ప్రోటోకాల్ పాటించడం లేదని ఢిల్లీ వెళ్లి తీవ్రమైన ఆరోపణలు చేసి, ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రిలకు ఫిర్యాదు చేసిన గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ పట్ల రాష్ట్ర మంత్రి కెటి రామారావు తీవ్రంగా స్పందించారు.
గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయతీ లేదంటూనే గవర్నర్.. గవర్నర్‌గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాం. గవర్నర్ వ్యవస్థతో మాకెందుకు పంచాయితీ ఉంటుంది?’ అంటూ నర్మగర్భంగా వాఖ్యలు చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ తాము ఎక్కడ కూడా గవర్నర్ పదవికి భంగం కలిగే విధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.
గవర్నర్ అలా ఎందుకు ఊహించుకుంటున్నారో? ఎందుకు స్పందిస్తున్నారో? అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌కు ఎక్కడ అవమానం జరిగింది? ఎవరు ఎవర్నీ అవమానించారు?’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో అభ్యంతర పెట్టినందుకు అవమానిస్తారా .? అని గవర్నర్ చెప్పినట్లు విన్నానని పేర్కొంటూ కౌశిక్‌రెడ్డి ఎంఎల్‌సి అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డు వచ్చిందా? అంటి కేటీఆర్ ప్రశ్నించారు.
తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు గవర్నర్ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డురాలేదా ? అని నిలదీశారు. గవర్నర్ మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు చెప్పారు. గవర్నర్ ఎందుకు ఆ విధంగా ఊహించుకుంటున్నారు? అని అడిగారు.
నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు తమకు ఎలాంటి పంచాయితీ లేదని గుర్తు చేశారు. గవర్నర్ విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. శాసనసభ సంవత్సరంలో మొదటి సమావేశం అయితే గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో రాసి ఉందని గుర్తు చేశారు.
కానీ అది తొలి సమావేశం కాదు కాబట్టి పిలవలేదని వివరణ ఇచ్చారు. సమావేశం ప్రొరోగ్ కాలేదు.. అందుకే గవర్నర్ ప్రసంగం లేదని చెబుతూ దీనినే గవర్నర్ అవమానంగా తీసుకుంటే తాము చేయగలిగిందేమి లేదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.