అమెరికాలో హెచ్ 4 వీసాదార్లు ఉద్యోగాలు చేసుకునే స్వతహసిద్ధ హక్కు పొందేందుకు మార్గం ఏర్పడింది. సంబంధిత బిల్లును చట్టసభలోని ఇద్దరు అమెరికా మహిళా సభ్యులు ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదానికి తీసుకురావడంతో హెచ్ 4 వీసాదార్లలో ఆశలు రేకెత్తాయి.
దేశంలో తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యోగ కొరతను తీర్చేందుకు ఈ బిల్లు ఆమోదం తప్పనిసరి అని ప్రతినిధుల సభ సభ్యురాళ్లు తెలిపారు. ఉద్యోగ కార్మిక కొరతతో అమెరికా వ్యాపార వర్గాలు, ప్రముఖ సంస్థలకు ఉత్పత్తి లేదా నిర్వహణపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగమించేందుకు వెంటనే హెచ్ 4 వీసాదార్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సి ఉంది.
దీనిని హక్కుగా నిర్థారించాల్సి ఉంది. దీనితో వలసపై వచ్చిన కుటుంబాలు కలిసి ఉండేందుకు మార్గం ఏర్పడుతుందని ప్రజా ప్రతినిధులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకూ ఉన్న ఉద్యోగ నిబంధనల మేరకు హెచ్ 1 బి, హెచ్2ఎ, హెచ్ 2 బి, హెచ్ 3 వీసాదార్ల వెంబడి వచ్చే వారి జీవిత భాగస్వాములు వారి పిల్లలకు హెచ్ 4 వీసాలు ఇస్తున్నారు.
అయితే వీరికి ఉద్యోగాలు చేసుకునేందుకు హక్కులేదు. ఇతర వీసాలపై అమెరికాకు వచ్చిన వారి ఆదాయ వనరులతోనే వీరు గడపాల్సి వస్తోంది. కాంగ్రెస్ ఉమెన్ కరోలిన్ బౌర్డెక్స్, మేరియా ఎలివిరా సలాజర్లు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత చట్టాల సవరణల ద్వారా హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగ హక్కుకు వీలు కల్పించాల్సి ఉందని బిల్లులో పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఈ వీసాదారులు ఉద్యోగాలు చేసుకునేందుకు అత్యంత సంక్లిష్టమైన ఎంప్లాయిమెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్ (ఇఎడి)ని ఫారంను పొందాల్సి ఉంటుంది. ఇది దక్కించుకోవడం ఇబ్బందికరం అవుతోంది. అత్యంత నైపుణ్యపు ఇమిగ్రేంట్ల జీవిత భాగస్వాములు వారి పిల్లలు అమెరికాలో తగు విధమైన ఉద్యోగాలు పొందే దిశలో అనేక అధికారిక జాప్యాలకు గురి కావల్సి వస్తోంది, ఇది వలసలపై ఇక్కడికి వచ్చే వారికి పెనుభారంగా మారుతోందని బిల్లులో ఆవేదన వ్యక్తం చేశారు.