దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు.
దేశంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ వెయ్యి కంటే తక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. రాష్ట్రాలు ఆర్థిక, సామాజిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నందున, కోవిడ్ -19 నిర్వహణ కోసం రిస్క్ అసెస్మెంట్-ఆధారిత విధానాన్ని నిరంతరం అనుసరించాల్సిన అవసరం ఉందని భూషణ్ రాష్ట్రాలను కోరారు.
హర్యానా మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో 367 కొత్త కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 8తో ముగిసిన వారంలో 416కి పెరిగింది, ఇది భారతదేశంలోని కొత్త కేసులలో 5.70 శాతంగా ఉంది. గత వారంలో రాష్ట్రంలో కోవివ్ కేసుల పాజిటివిటీ 0.51 శాతం నుంచి 1.06 శాతానికి పెరిగింది.
ఢిల్లీలో ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో వారానికి కొత్త కేసులు 724 నుంచి ఏప్రిల్ 8తో ముగిసిన వారంలో 826కి పెరిగాయి. పాజిటివిటీ రేటు 0.51 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగింది. ఏప్రిల్ 8తో ముగిసిన వారంలో కేరళలో 2,321 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 13.45 శాతం నుంచి 15.33 శాతానికి పెరిగింది.
ఏప్రిల్ 8తో ముగిసిన వారంలో మిజోరాంలో వారంవారీ కేసులు 814కి పెరిగాయి. రాష్ట్రంలో పాజిటివిటీ 14.38 శాతం నుంచి 16.48 శాతానికి పెరిగింది. ఏప్రిల్ 8తో ముగిసిన వారంలో మహారాష్ట్రలో 794 కేసులు నమోదయ్యాయి. 0.39 శాతం నుంచి 0.43 శాతానికి పాజిటివిటీ పెరిగింది.