తాను తలుచుకుంటే తెలంగాణలో ప్రభుత్వం పడిపోయేది అంటూ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొదటి రోజు ప్రధాని నరేంద్ర మోదీని కలసిన అనంతరం తనకేమి అవమానం జరగలేదని అన్నట్లు మాట్లాడిన ఆమె, మరుసటి రోజు హోమ్ మంత్రి అమిత్ షాను కలసిన అనంతరం టి ఆర్ ఎస్ ప్రభుత్వం పట్ల రాజకీయ విమర్శలు చేయడంతో కలకలం రేగుతోంది.
పలువురు రాష్ట్ర మంత్రులు ఆమె వాఖ్యలపై తీ వ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 119 మంది ఎమ్యెల్యేలలో 100 మందికి పైగా మద్దతు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రద్దయి ఉండేదని ఒక గవర్నర్ అనడం రాజకీయ వాఖ్యలే అంటూ మండి పోతున్నారు. తమిళిసై చేసిన వ్యాఖ్యలు గవర్నర్ వ్యవస్థకు మచ్చ తెచ్చాలా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఢిల్లీకి వెళ్లిన తమిళిసై రాష్ట్రపతిని కలువకుండా ప్రధానిని, హోంశాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మం త్రి కలిసి ఫిర్యాదు చేయడంలో ఉద్దేశ్యం ఏమిటని ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. గతంలో ఎన్టిఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గవర్నర్ తెలుసుకోవాలని ఆమె హితవు చెప్పారు. అయితే, గవర్నర్‌ను చిన్నచూపు చూడాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు.
తమిళనాడులో ఆరుసార్లు పోటీ చేసి ఓడిపోయి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసైకి గవర్నర్ పదవి ఇస్తే ఆమె రాజకీయ పార్టీని కూడా చూడకుండా సీఎం కేసీఆర్ అత్యంత గౌరవం ఇచ్చారని ఆమె తెలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రుల్ని కలిసిన తర్వాత ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం చూస్తుంటే ఆమె బీజేపీ కార్యకర్తగా మాట్లాడినట్లు కనిపిస్తోందని ఆమె విమర్శించారు.
వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ కానందునే బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నామని చెబుతూ దీనిపై గవర్నర్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని తమిళిసై భూతద్దంలో చూసి తనను రాష్ట్ర ప్రభుత్వం అవమానించినట్లుగా భావిస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.
ఆమె హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ ఉంటుందని మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమెను ఎక్కడ అవమానించారో చెప్పాలని కోరుతూ రాజ్యాంగపరంగా గవర్నర్‌కు ఇవ్వాల్సిన మర్యాద తప్పక ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
ఇటీవల గవర్నర్ యాదాద్రికి వెళ్లే 10 నిమిషాల సమయం ముందు సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించారని చెబుతూ కేవలం 10 నిమిషాల ముందు చెబితే ప్రొటోకాల్ ఎలా సాధ్యమవుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు.
అసెంబ్లీని సమావేశపరచకుండా ఉంచే హక్కుగానీ, బడ్జెట్ ప్రతిపాదనలపై సంతకం చేసే హక్కుగానీ గవర్నర్‌కు ఉండదని రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 174వ అధికరణ ప్రకారం గవర్నర్ శాసనసభను సమావేశ పరచాల్సిందేనని చెప్పారు. ఒకవేళ గవర్నర్ అలా చేస్తే.. ప్రభుత్వం రాష్ట్రపతి వద్దకు వెళుతుందని తెలిపారు.
ఇలా ఉండగా, బడ్జెట్ సమావేశాలకు అనుమతివ్వకుండా 15 రోజులు పెండింగ్‌లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై ఓ గవర్నర్ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని మాజీ ఎంఎల్‌సి, ప్రొఫెసర్ నాగేశ్వర్రావు స్పష్టం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని…అలాంటప్పుడు కెసిఆర్‌ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరు? అని ఓ ట్వీట్లో ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని, అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం కాదని గుర్తు చేశారు.
గవర్నర్ తమిళిసై గవర్నర్‌గానే ఉండాలని రాజకీయ నాయకురాలిగా ఉండకూడదని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య ఎద్దేవా చేశారు. ఆమె బిసి వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ బిసిలను కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వదని, ఆమెకు అది ఇష్టం కూడా ఉండదని ఆయన విమర్శించారు. అందరిని కలవాల్సి ఉండగా ఆమె మాత్రం కొందరిని మాత్రమే కలుస్తామనడం మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు.
పార్టీ వాళ్లు చెబితేనే కలుస్తామనడం కరెక్ట్ కాదనీ, సమస్యలపై ఆమె స్పందించాలి తప్ప రాజకీయ కోణంలో పోయి పార్టీలను ఇబ్బంది పెట్టడాన్ని తాము కూడా వ్యతిరేకిస్తామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ బద్దంగా ఉన్న హక్కులను ఆమె వాడుకోవాలి తప్ప ఇతర పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు.
తన కుటుంబ సమస్యల నుంచి తప్పించుకునేందుకే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో విభేదాలున్నట్టు సీఎం కేసీఆర్ చిత్రీకరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘తనను సీఎంను చేయాలని కేటీఆర్ తన తండ్రి కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టమవుతుందని కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. గవర్నర్‌ను సాకుగా చూపి కేసీఆర్ కుటుంబ సమస్యల నుంచి తప్పించుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు జరిగిన రోజు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండి కూడా వెళ్లలేదని చెబుతూ సీఎం కేసీఆర్‌కు కోపం వస్తుందనే ఆ ఇద్దరు రాలేదన్నారు. తాను పిలిస్తే కిషన్‌రెడ్డి, సంజయ్‌లు కూడా రాలేదని కేంద్రానికి చేసిన ఫిర్యాదులో గవర్నర్ ప్రస్తావించి ఉంటే బాగుండేదని రేవంత్ పేర్కొన్నారు. నిజంగా హైదరాబాద్ లోని ప్రజా సమస్యల పరిష్కారం పట్ల గవర్నర్ కు ఆసక్తి ఉంటె రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం ఆమెకు విశేష అధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు.