ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తప్పి పోలేదని, అందుకు చాలా సమయం పడుతుందని స్ఫష్టం చేస్తూ సగటున ప్రతి నాలుగు నెలలకు కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ హెచ్చరించారు. అన్ని దేశాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని, ఇప్పటికీ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా అందని దేశాలు ఉన్నాయని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త వేరియంట్లు ఆసియాలో వ్యాప్తి చెందడానికి కొంత సమయం పడుతుందని, అదే సమయంలో ఆసియాలోని అన్ని దేశాల ప్రభుత్వాలు, ఔషధ కంపెనీలు సమన్వయంతో ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. గవి కొవాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్మెంట్ సమ్మిట్ 2022లో ”వన్ వరల్డ్ ప్రొటెక్టెడ్- బ్రేక్ కొవిడ్ నౌ” అనే వీడియో సందేశంలో గుటెరస్ మాట్లాడారు.
ఇప్పటికీ ప్రతి రోజూ 1.5 మిలియన్ కేసులు వస్తున్నాయని, ఆసియా వ్యాప్తంగా కేసులు విజృంభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని దేశాల్లో మహమ్మారి ప్రారంభం నాటి నుండి అత్యధిక మరణాలు నమోదయ్యాయని తెలిపారు. కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనలు, వ్యాప్తి ఎంత వేగంగా ఉంటాయనేదానికి ఒమిక్రాన్ మనకొక రిమైండర్’ అంటూ గుటెరస్ గుర్తు చేశారు.
ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందికి ఇంకా వ్యాక్సిన్ అందలేదని, కొన్ని సంపన్న దేశాలు మాత్రం రెండో బూస్టర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసమానతలను ఇది ఎత్తిచూపుతోందని పేర్కొన్నారు.
ఈ ఏడాది మధ్యనాటికి 70 శాతం మంది జనాభాకు వ్యాక్సిన్ అందించాలన్న లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నామని చెప్పారు. సగటున ప్రతి నాలుగు నెలలకొక కొత్త వేరియంట్ వెలుగుచూస్తోన్న సమయంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడం కీలకమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాలు, ఔషధ సంస్థలు కలిసి పనిచేయాలని కోరారు.
సంపన్న దేశాల్లో మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా కృషి చేయాలని సూచించారు. కాగా, బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ ఎక్స్ఇ వేరియంట్ . ఒమిక్రాన్ కంటే 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 600కు పైగా కేసులు నమోదయ్యాయి.