భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఎందరో కళాకారులు సర్వస్వాన్నీ త్యాగం చేశారని గుర్తు చేస్తూ వారి స్పూర్తితో భారతీయ కల, సాంస్కృతిక రూపాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉన్నదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.
బ్రిటిషర్ల అరాచకాన్ని ఎదిరించే ప్రయత్నంలో కళలు, సాంస్కృతిక రూపాలు ‘ప్రభావవంతమైన రాజకీయ ఆయుధాలు’గా ఎంతగానో ఉపయుక్తమయ్యాయని ఆయన గుర్తు చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, సుబ్రమణ్య భారతి, కాజీ నజ్రూల్, బంకించంద్ర చటర్జీ వంటి వారెందరో తమ కవితలు, పాటల ద్వారా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని నిరంతరం జాగృతం చేశారని పేర్కొన్నారు.
ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నాటక అకాడెమీ అవార్డులు, లలితకళ ఆకాడెమీ ఫెలోషిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, విజేతలకు అవార్డులు అందజేశారు. 2018 నుంచి 2021 వరకు మూడేళ్లకు గానూ ఈ అవార్డులు ఒకేసారి అందజేశారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ భారతదేశ అస్తిత్వానికి మన భాష, మన సంస్కృతి, మన కళారూపాలే కారణమని, అందుకే వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని తెలిపారు. మన వైభవోపేతమైన భవిష్యత్తులో, వర్తమానానికి, ఘనమైన భవిష్యత్తులో మన సంస్కృతి-సంప్రదాయాలు, కళలు, సాంస్కృతిక రూపాలు అంతర్లీనంగా నిగూఢమై ఉన్నాయని చెప్పారు.
ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకురావడంలో కళారూపాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. కళారూపాలను కాపాడుకోవడంలో భాష పోషించే పాత్ర ప్రధానమైనదన్న ఉపరాష్ట్రపతి కళలను కాపాడుకోవడం కోసం మాతృభాషల పరిరక్షణ అత్యంత కీలకమని సూచించారు.
అందుకే కనీసం పదోతరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన జరగడంతోపాటు ప్రతి విద్యార్థికి బాల్యం నుంచే ఏదైనా ఒక కళను నేర్పించడం ద్వారా వారిలో సృజనాత్మకతకు బాటలు వేయవచ్చని ఆయన తెలిపారు. అలాంటప్పుడు బాల్యం నుంచే చిన్నారుల్లో కళలు, భాష, సంస్కృతి-సంప్రదాయాలు, జాతీయతా భావన వంటివి అలవడుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లాది సూరిబాబు (కర్నాటక సంగీతం), ఎస్ కాశీం, ఎస్ బాబు (నాదస్వరం), పసుమర్తి రామలింగ శాస్త్రి (కూచిపూడి), కోటా సచ్చిదానంద శాస్త్రి (హరికథ)లు అవార్డులు అందుకున్నారు. 62వ జాతీయ ప్రదర్శన అవార్డుల్లో భాగంగా శిల్పకళల విభాగంలో తెలుగు యువకుడు జగన్మోహన్ పెనుగంటికి అవార్డును ఉపరాష్ట్రపతి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, సంగీత, నాటక అకాడెమీ, లలితకళ అకాడెమీ అధ్యక్షురాలు శ్రీమతి ఉమ నందూరి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి సంజుక్త మృదుల కూడా పాల్గొన్నారు.