ఎన్నికల కోసం అంటూ మంత్రివర్గంలో మార్పుల కోసం మొత్తం మంత్రులందరితో రాజీనామాలు చేయించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాటలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా నడిచేటట్లు చేయడం కోసం బిజెపి జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ సంస్కృతిని అద్దంపట్టే విధంగా మంత్రువర్గంలో మార్పుల కోసం ఢిల్లీ చుట్టూ బొమ్మై ప్రదక్షణాలు చేస్తున్నారు.
గత వారం రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసినా మంత్రివర్గ విస్తరణకు అనుమతి లభించలేదు. పార్లమెంట్ సమావేశాల్లో తీరిక లేకుండా ఉన్నారంటూ హోమ్ మంత్రి అమిత్ షాతో కలవడం కూడా సాధ్యపడలేదు. అయితే ముఖ్యమంత్రి పదవికోసం ప్రయత్నిస్తున్న మాజీ సీఎం జగదీశ్ శెట్టియార్ మాత్రం బొమ్మై బెంగళూరుకు చేరేలోగానే అమిత్ షాను కలసిన్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తును కర్ణాటకకు చెందిన పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్ సంతోష్ అత్యంత రహస్యంగా చేస్తున్నట్లు తెలుస్తున్నది. పార్టీ ఎమ్యెల్యేలతో ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. పలువురు మంత్రుల పనితీరుతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న సంగతి ఈ సందర్భంగా బహిర్గతమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో బొమ్మై కేబినెట్లో కొద్దిపాటి మార్పులకు బదులు భారీ ప్రక్షాళన చేపట్టేదిశలో అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలికి, మరికొందరికి అవకాశం కల్పిస్తే అది 2023 శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలదన్న భయంతో అందరు మంత్రులతో రాజీనామా చేయించే అంశం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
గందరగోళానికి తావులేని విధంగా ప్రక్షాళన కసరత్తు సాఫీగా సాగిపోయేలా ఈ మొత్తం వ్యవహారాన్ని అధిష్టానం కనుసన్నల్లోనే పూర్తి చేయనున్నారు. సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికి, జగన్ తరహాలో వారికి జిల్లా ఇన్చార్జ్లుగా బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.