తెలంగాణాలో తాగు నీటి ఎద్దడితో ఎండాకాలంలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. తాగేందుకు నీరు దొరక్క రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు అవస్తలుపడుతున్నారని, పల్లెవాసులు శివార్లలోని బోరుబావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో తాగునీటి సమస్య తీర్చేందుకు కేసీఆర్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెబుతూ మిషన్ భగీరథ ఉన్నా ప్రజలకు మాత్రం నీళ్ల కోసం పరేషాన్ తప్పడం లేదని ఆమె విమర్శించారు.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లోని 23,775 ఆవాసాల్లో 54,06,070 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని విజయశాంతి ఆరోపించారు.
కొన్ని చోట్ల ఇంకా ప్రధాన పైపులైన్ పనులే పూర్తికాలేదని, ఇంకొన్ని చోట్ల పూర్తయినా ట్యాంకులు నిర్మించలేదని ఆమె మండిపడ్డారు. మరికొన్ని చోట్ల ట్యాంకులు నిర్మించినా నీళ్లు రావడంలేదని ఆమె విమర్శించారు. పలు ప్రాంతాల్లో నీరు వస్తున్నా నిర్వహణ లోపంతో పైపులు లీకవుతూ నీళ్లు వృథాగా పోతున్నాయని ఆమె విమర్శించారు.
మరోవైపు నిధుల కొరత, బిల్లుల్లో జాప్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని ఆమె ఆరోపించారు. నాణ్యతలేని పైపుల ఏర్పాటు, ప్రధాన, అంతర్గత పైపులైన్ల లీకేజీలు ఈ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయని ఆమె చెప్పారు.
ఇప్పటికైనా ప్రజల నీటి కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రభుత్వానికి ఆమె సూచించారు. ప్రజల బతుకులతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్కు ప్రజలే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు.