సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధి అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలన్నీ ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్’ ఇతివృత్తంతో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొంటూ భారతదేశం నుంచి పేదరికాన్ని నిర్మూలించడం మనముందున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య అని తెలిపారు.
బాలలు, బాలికలకు సమానమైన విద్యనందించడం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు, పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అందరికీ సమానమైన ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా కీలకం అని నాయుడు చెప్పారు. గ్రామరాజ్యం లేని రామరాజ్యం అసంపూర్ణమన్న మహాత్ముని మాటలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు.
పేదరికం లేని, పరిశుభ్రమైన, విద్య, వైద్యం అందుబాటులో ఉన్న చిన్నారులకు అనుకూల వాతావరణం కలిగిన, సామాజిక భద్రత కలిగిన, సుపరిపాలన కలిగిన గ్రామాలను నిర్మించుకున్నప్పుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
గ్రామీణ సంస్థలకు నిధుల కేటాయింపు పెరిగిందన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే తలసరి గ్రాంట్ 10వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం రూ.100 ఉండగా.. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం రూ.674కు చేరిందని పేర్కొన్నారు. నిధులు (ఫండ్స్), విధులు (ఫంక్షన్స్), నిర్వాహకులు (ఫంక్షనరీస్) లను సమర్థవంతంగా అందిస్తే సుస్థిరమైన గ్రామస్వరాజ్యం సాధించవచ్చని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.
నిధులను నేరుగా పంచాయతీలకు చేర్చడంలో విజయం సాధిస్తే అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు. దీంతోపాటుగా పంచాయతీరాజ్ వ్యవస్థలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు.
ఆర్థికంగా ఆత్మనిర్భరత వచ్చినపుడే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. అనుసంధానత (రోడ్లు, ఇంటర్నెట్), విద్య, వైద్యం, మౌలికవసతులు, నీటిపారుదల వ్యవస్థ వంటివి గ్రామాలకు చేర్చేందుకు వందశాతం లక్ష్యంతో ముందుకెళ్లాలని కూడా ఆయన సూచించారు.
గ్రామాల అభివృద్ధి, సుపరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గ్రామసభలకు సరైన ప్రాధాన్యత కల్పించాలన్న ఉపరాష్ట్రపతి, గ్రామాభివృద్ధిలో గ్రామసభల పాత్ర చాలా కీలకమని చెప్పారు. కొంతకాలంగా ఈ సభలకు ప్రాధాన్యత తగ్గుతూవస్తోందన్న ఆయన, మళ్లీ గ్రామసభలకు పునర్వైభవం తీసుకురావాలని సూచించారు.
పాలనలోని ప్రతి విభాగంలోనూ పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత అవసరం అన్న ఉపరాష్ట్రపతి.. వ్యవస్థను మరింత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లేందుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘ఈ-గ్రామ్ స్వరాజ్ ఫర్ స్మార్ట్ అండ్ గుడ్ గవర్నెన్స్’ వంటి డిజిటల్ సాంకేతికతకు పెద్దపీట వేయడాన్ని అభినందించారు. ఇప్పటివరకు 2.38 లక్షల గ్రామాలు ‘ఈ-గ్రామ్ స్వరాజ్’ ను వినియోగిస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, పాలనలో సాంకేతికత వినియోగం మరింతగా పెరగాలని సూచించారు.