ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ మానవ శరీర అవయవాలపై, వారి రోగ నిరోధకశక్తిపై, శ్వాస వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపు తోనే ఉంది. తాజాగా పురుషుల పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఎసిఎస్ ఒమేగా పత్రిక ఈ వివరాలను అందించింది.
పురుషుల పునరుత్పత్తి అవయవాల్లో కరోనా వైరస్ ఉనికి ఉంటున్నట్టు ఇటీవల కొన్ని ఆధారాలు లభ్యమైన క్రమంలో మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం చూపుతుందా? అన్న విషయాన్ని కనుగొనేందుకు ఐఐటి-బాంబే, ముంబయిలోని జస్లోక్ ఆసుపత్రి-పరిశోధన కేంద్రం నిపుణులు పరిశోధనలు చేపట్టారు.
ఇందులో భాగంగాకరోనా నుంచి కోలుకున్న 17 మంది, ఇన్ఫెక్షన్ సోకని సంపూర్ణ ఆరోగ్యవంతులైన మరో 10 మంది పురుషుల వీర్యంలోని ప్రొటీన్ల స్థాయులను విశ్లేషించారు. వీరంతా వంధ్యత్వం లేని 20-45 ఏళ్ల వయసు వారేనని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో ఇన్ఫెక్షన్ కారణంగా స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలే కనిపించినా వారి సంతానోత్పత్తిని మాత్రం గట్టిగానే దెబ్బతీస్తున్నట్టు కనుగొన్నారు.
పరిశోధకులు వివరిస్తూ … కోవిడ్ బాధితులైన మగవారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటోందన్నారు. వాటి చలనశీలత కూడా అంతంతమాత్రమేనన్నారు. ఆకారంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. పునరుత్పత్తికి దోహదపడే వీర్యంలోని 27 ప్రొటీన్ల స్థాయులు పెరగ్గా, 21 ప్రొటీన్ల స్థాయులు తగ్గాయని చెప్పారు.
ముఖ్యంగా సెమెనోజెలిన్-1, ప్రొసాపోసిన్ ప్రొటీన్ల స్థాయులు ఉండాల్సిన దానిలో సగం కంటే తక్కువగానే ఉంటున్నట్టు గుర్తించామని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విషయాలను మరింత విస్పష్టంగా నిర్ధారించుకునేందుకు విస్తఅతస్థాయిలో పరిశోధన సాగించాల్సి ఉందన్నారు.