అందరూ అనుమానిస్తున్నట్లే పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వంపై `రిమోట్ కంట్రోల్’ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఉన్నట్లు వివాదం చెలరేగింది. పంజాబ్ విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లేకుండానే ఈ సమావేశం జరగడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయన ఓ రిమోట్ కంట్రోల్ అంటూ విరుచుకు పడుతున్నాయి. పంజాబ్ లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (పిఎస్‌పిఎల్) ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యుత్ శాఖ కార్యదర్శి సైతం పాల్గొన్నారు.
పంజాబ్ రిమోట్ కంట్రోల్ ఢిల్లీ చేతుల్లో ఉందంటూ కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు విమర్శించాయి. సిఎం భగవంత్ మాన్ గైర్హాజరవుతారని తెలిసినా ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఐఎఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పేరుకే సిఎం అని, రిమోట్ కంట్రోల్ ఢిల్లీ చేతుల్లోనే ఉందన్న వాస్తవాన్ని ఈ సమావేశం బట్టబయలు చేసిందని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు పేర్కొన్నారు.
సమాఖ్య విధాన ఉల్లంఘనని, పంజాబ్ గౌరవానికి అవమానమని… దీనిపై ఇరువురు సమాధానమివ్వాలని ట్వీట్ చేశారు. పంజాబ్‌లో అత్యంత ఘోరం జరిగిందని, గతంలో ఊహించినట్లుగానే కేజ్రీవాల్ పంజాబ్‌ని ఆక్రమించుకున్నారని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ సమావేశానికి హాజరుకావడంతో భగవంత్ మాన్ రబ్బర్ స్టాంప్ మాత్రమేనని అర్థమైందని పేర్కొన్నారు.