తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్తపుత్రుడు’ అని విమర్శించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను ఇంకోసారి సీబీఎన్ (చంద్రబాబునాయుడు నారా) దత్తపుత్రుడని విమర్శిస్తే… వైసీపీ అగ్రనాయకత్వాన్ని నేను సీబీఐ దత్తపుత్రులని పిలుస్తాను. టీడీపీ-బీ టీమ్.. జనసేన అని వారు మాట్లాడితే.. వారిని చర్లపల్లి జైలు షటిల్ టీమ్ అంటాను’’ అని హెచ్చరించారు.
జగన్ పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ 7 లక్షల చొప్పున సహాయం అందించాలని డిమాండ్ చేసిన ఆయన తమ పార్టీ తరపున రూ 1 లక్ష చొప్పున సహాయం అందించనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
ఆ మేరకు మంగళవారం పుట్టపర్తి మండలం కొత్తచెరువులోని బాధిత కౌలురైతు సాకే రామకృష్ణ నివాసానికి చేరుకొని, పిల్లల చదువుల బాధ్యత జనసేన తీసుకుంటుందని ఆత్మస్థైర్యాన్ని నింపి, రూ.లక్ష చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. అక్కడి నుంచి కౌలురైతు భరోసా పర్యటనను ప్రారంభించారు.
ఆ తర్వాత, ఆత్మహత్య చేసుకున్న కౌలురైతులు అనపరెడ్డి రాజశేఖర్రెడ్డి(ధర్మవరం), నెట్టూరు బాబు(గొట్లూరు), రామకృష్ణ(బత్తలపల్లి), చిన్న గంగయ్య (పూలకుంట) కుటుంబాలను నేరుగా కలుసుకుని సాయం అందించారు. సాయంత్రం 4 మన్నీల గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండ వద్దకు చేరుకొని అక్కడ 25 మంది బాధిత కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా జగన్ విమర్శలపై ఘాటుగా స్పందిస్తూ, 16 నెలలు జైలులో కూర్చుని షటిల్ ఆడింది వాస్తవం కాదా? అని సీఎం జగన్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘నేను ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతుంటే.. వైసీపీ అగ్రనేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నేనేమీ విదేశాల్లో చదువుకోలేదు. నాది లండన్ రాయల్ ఫ్యామిలీ అసలే కాదు. ప్రకాశం జిల్లాలో పెరిగిన వాడ్ని. వైసీపీ నేతలు తిట్టే భాష కంటే మంచి భాషే నాకొచ్చు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం ఇష్టం లేకనే ఆ భాష వాడటం లేదు’’ అని స్పష్టం చేశారు.
‘మీరేమైనా సుభా్షచంద్రబోస్, సర్దార్ పటేల్ మాదిరిగా దేశసేవ చేసి జైలుకెళ్లారా..?’ అని ఎద్దేవా చేశారు. వైసీపీ మూడేళ్ల పాలనలో 3వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బాధిత రైతు కుటుంబాలను పరామర్శించే తీరిక ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం రైతులు ఎందరు చనిపోయారనే లెక్క కూడా లేదు” అంటూ ధ్వజమెత్తారు.
“ఏడాది క్రితం రైతు ఆత్మహత్య చేసుకుంటే… ఈ రోజు నేను వస్తున్నానని తెలిసి.. ఆయా కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 170 మందికిపైగా కౌలు రైతులు ఆత్మహత్య పాల్పడ్డారు. వారందరికీ ఆర్థికసాయం అందిస్తాం’’ అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అయితే.. ఆర్థికసాయంతో ఆ కుటుంబాలను వదిలేయకుండా వారి పిల్లల చదువు బాధ్యతను జనసేన తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. దీని కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ సంక్షేమ నిధికి తనవంతుగా సగభాగం నిధులు ఇస్తానని, మిగిలిన సగం నిధులు ఇచ్చేందుకు తమ పార్టీ నాయకులు ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.