తెలంగాణాలో విశేష ప్రాముఖ్యత గల ప్రాణహిత పుష్కరాలపై కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పుష్కర స్నానాలకు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యాల గురించి అసలేమీ పట్టించుకోలేదు. ఏప్రిల్ 13న సదా, సీదాగా జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం అర్జునగుట్టలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు.
ఏప్రిల్ 13 నుండి 24 వరకు జరిగే ఈ పుష్కారాలకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన్నల్టు మంత్రి ప్రకటించినా, కనీసం గత పుష్కరాల సమయంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన పుష్కరఘాట్లనైనా మెరుగులు దిద్దే పనే చేయలేదు. పుష్కర ఏర్పాట్లకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు.
కాళేశ్వరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులను మహారాష్ట్రలోని సిరొంచకు తీసుకెళ్లేందుకు పది బస్సులు పెట్టింది. దీంతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని
భావించిన భక్తులకు నిరాశ తప్పడం లేదు. వాళ్లంతా పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవంక, మహారాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లతో సిరొంచలో ఏర్పాట్లు ఘనంగా చేసింది. ప్రాణహిత నీళ్లపై ఆధారపడి లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన రాష్ట్ర సర్కారు.. అదే ప్రాణహితకు పుష్కరాలను కాళేశ్వరం వద్ద నిర్వహించలేక తప్పించుకున్నది.
భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, అర్జునగుట్ట ఏరియాల్లో అక్కడి కలెక్టర్లు లోకల్ ఫండ్స్‌తో కొన్ని ఏర్పాట్లు చేశారు. కీలకమైన కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
పుష్కరాలు జరిగే 12 రోజుల్లో కాళేశ్వరానికి రోజుకు కనీసం 2 లక్షల మంది చొప్పున 30 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రూ.22 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
గతంలో కట్టిన పుష్కరఘాట్లు అందుబాటులో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వకపోవడంతో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోయారు. దీంతో పుష్కరాలకు ఒక రోజు ముందు కాళేశ్వరం నుంచి మహారాష్ట్రలోని సీరొంచకు 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పుణ్య స్నానాలకు తెలంగాణ, ఏపీ నుంచి కాళేశ్వరం వచ్చే భక్తులను సీరొంచ పుష్కర ఘాట్‌కు ఉచితంగా తరలిస్తామని, ఇందుకు రోజుకు 10 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హనుమకొండ నుంచి కాళేశ్వరానికి 200 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీరొంచకు ఉచిత బస్సుల్లో వెళ్లవచ్చు.
తెలంగాణలోనే పుట్టి, ఇక్కడే అంతర్లీనమయ్యే జీవనది ప్రాణహిత. గోదావరి నదికి ప్రాణహిత ప్రధాన ఉపనది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడి హెట్టికి పైభాగంలో పెన్ గంగా, వార్దా నదుల కలయితో ప్రాణహిత నది పుట్టింది. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రయాణం మొదలై కాళేశ్వరం వరకు 113 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ప్రాణహిత కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది.
గోదావరి నది ఎప్పటికి ఎండిపోకుండా జలసిరులు అందిస్తూ ప్రాణహిత పేరును సార్థకం చేసుకుంటుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రాణహిత నది పుష్కరాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. ప్రాణహిత నది ఎక్కువగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తుంది.
ఉమ్మడి రాష్ట్రంలో 2010లో తుమ్మిడిహెట్టి నుంచి కాలేశ్వరం వరకు ఎంతో ఘనంగా పుష్కరాలను నిర్వహించారు. ప్రాణహిత జన్మస్థానమైన తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కరఘాట్లు, షవర్ బాత్ తో పాటు మహిళలు బట్టలు మార్చుకునేందుకు, స్నానాలకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేశారు.
ఆనాడు కట్టిన పుష్కరఘాట్లే ఇప్పటికీ తుమ్మిడిహెట్టి దగ్గర దర్శమిస్తాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో తుమ్మిడి నుంచి పుష్కర ఘాట్ వరకు సీసీ రోడ్డును వేశారు. గ్రామ పంచాయతీ ఆధర్యంలో తాత్కాలిక దుకాణాల ఏర్పాట్ల పనులు జరిగాయాయి. అయితే నదిలో గడ్డి, పిచ్చి మొక్కలు అపరిశుభ్రత ఉండడంతో నదిలో స్నానం చేయడానికి భక్తులు భయపడుతున్నారు.
2010లో 50 వేల నుంచి లక్ష మంది భక్తులు వచ్చి పుణ్య స్నానాలు చేశారు. ఈసారి భక్తుల తాకిడి తుమ్మిడిహెట్టి దగ్గర ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట దగ్గర అధికారికంగా ప్రాణహిత పుష్కరాలను స్వయంగా ప్రారంభించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం పుష్కర ఏర్పాట్లపై సమీక్ష కూడా చేయలేదు.
కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడే రూ. పది కోట్ల నిధులు కేటాయించారు. ప్రాణహిత పుష్కరాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం `రాష్ట్ర పండుగ’గా ప్రకటించింది. రోజుకు లక్ష మంది భక్తులు ప్రాణహిత నది పుష్కరాల్లో పాల్గొన్నారు.
ప్రాణహిత పుష్కరాలపై గత ఏడాది డిసెంబర్ 28న చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, పిండ ప్రదానాలకు అనుకూలమైన స్థలాలు, పార్కింగ్, రవాణా, మంచినీటి, విద్యుత్ సరఫరాపై చర్చించారు. అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని అధికారులకు ఆదేశించారు.
దీంతో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి రూ 35 కోట్ల నిధులు అవసరం ఉంటుందని ప్రతిపాదనలు అధికారులు పంపించారు. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నిధులు కేటాయించలేదు.
జయశంకర్ జిల్లా కాళేశ్వరం దగ్గర భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర సిరోంచ తాలుకా నగరం దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వం పుష్కర ఘాట్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడే అధికారికంగా ప్రాణహిత పుష్కరాలను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. నగరం పుష్కర ఘాట్ కాళేశ్వరం కు పది కిలోమీటర్ల దూరం లోనే ఉంటుంది.
మహారాష్ట్ర, ఛత్తీస్ ఘర్, ఒడిశాలతో పాటు తెలంగాణలోని నలువైపులా నుంచి వచ్చే భక్తులు కాళేశ్వరం దగ్గర గోదావరిలో స్నానాలు చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. . అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రాణహిత నది ప్రవాహం ఆగిపోయింది. లక్ష్మీ బ్యారేజీ బ్యాక్ వాటర్ స్టోరేజీ ఉండడంతో ప్రాణహిత పరుగులు పెట్టడం లేదు. నీళ్లు నిలిచిపోయి వున్నాయి.
పుష్కరాల సమయంలో నైనా లక్ష్మీ బ్యారేజీ గేట్లను లిఫ్ట్ చేయాలని భక్తులు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నీటిని వదలడం వల్ల ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తాయని .., ఇందులో స్నానం చేస్తే ఏ బ్బందులు ఉండవని భావించారు.