మరోకొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్ లో కాంగ్రెస్ కుమ్ములాటలు శృతి మించుతున్నాయి. తనను పార్టీ నుండి బైటకు పంపలేక తనకు పొగ పెడుతున్నారని అంటూ ప్రముఖ పటిదార్ ఉద్యమ నాయకుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ధ్వజమెత్తారు.
తాను పార్టీలో ఉండగా, తనకు ఎటువంటి విలువ లేకుండా మరో ప్రముఖ్ పటిదార్ నేతను పార్టీలో చేర్చుకొని ప్రయత్నాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ఖొదాల్దమ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ పటేల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
అదే జరిగితే ఇక పార్టీకి తన అవసరం ఉండకపోవచ్చని తన అసంతృప్తికి కారణాన్ని వెల్లడి చేశారు. ‘‘2017లో మీరు హార్దిక్‌ని ఉపయోగించుకున్నారు. 2022 వచ్చేసరికి మీకు నరేష్ కావాల్సి వచ్చారు. 2027లో మరో పాటిదార్ నాయకుడు కోసం చూస్తారు. హార్దిక్ పటేల్‌నే శక్తిమంతుడిగా మీరు తయారు చెయ్యలేరా?’’ అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు.
రాష్ట్ర పార్టీ నాయకులు తనను వేధిస్తున్నారని, తాను పార్టీ విడిచి వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా తనను పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గుజరాత్ లో అడుగు చెప్పాలనుకుంటున్న ఆప్ ఇదే అవకాశం అనుకొంటూ హార్దిక్ పటేల్ కు తమ పార్టీలో చేరమని స్వాగతం పలికింది. హర్దిక్ పటేల్ కోసం తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా తెలిపారు. హార్దిక్ పటేల్ కోసం తమ తలుపులు తెరిచే ఉన్నాయని, అలాంటి విప్లవ నేతను తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పారు. పటీదార్ సామాజిక వర్గంలో ఆయనకున్న అభిమానాన్ని, ఆమోదాన్ని చూశామని పేర్కొన్నారు.