బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన రెండు రోజుల భారత పర్యటనను ఏప్రిల్ 21న అహ్మదాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో తొలిరోజే గుజరాత్లో బోరిస్ జాన్సన్ సమావేశం కానున్నారు. గుజరాత్లో పర్యటిస్తున్న తొలి బ్రిటన్ ప్రధాని ఆయనే కావడం విశేషం.
అదానీని కలవడమే కాకుండా, గిఫ్ట్ (గుజరాత్ ఇంటరుేషనల్ ఫైనాన్స్ టెక్) నగరాన్ని బోరిస్ జాన్సన్ సందర్శిస్తారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభారు పటేల్‌ను కలుస్తారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీకి ఆయన నివాళులర్పిస్తారు. వడోదర సమీపంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన హలోల్ను సందర్శిస్తారు.
గాంధీనగర్‌లోని అక్షరధామ్ ఆలయాన్ని కూడా బ్రిటన్ ప్రధాని సందర్శించనున్నారు. గుజరాత్లో, భారతదేశంలోని కీలక పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని బోరిస్ జాన్సన్ భావిస్తున్నట్లు బ్రిటీష్ హైకమిషన్ ప్రతినిధి తెలిపారు.
కరోనా మహమ్మారి దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసే ముందు, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 2020లో అహ్మదాబాద్ నుండి తన భారత పర్యటనను ప్రారంభించారు. ఆయన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన “నమస్తే ట్రంప్” కార్యక్రమానికి హాజరయ్యారు.
2014లో చైనా ప్రధాని జీ జిన్‌పింగ్ కూడా తన భారత పర్యటనను అహ్మదాబాద్ నుంచి ప్రారంభించారు. తన భారత్ పర్యటన గురించి జాన్సన్ ఒక ప్రకటనలో, “నిరంకుశ రాజ్యాల నుండి మన శాంతి, శ్రేయస్సుకు బెదిరింపులను ఎదుర్కొంటున్నందున, ప్రజాస్వామ్యాలు, స్నేహితులు కలిసి ఉండటం చాలా అవసరం” అని తెలిపారు.
కాగా, కరోనాను ఎదుర్కోవడంలో వైఫల్యం, రష్యా – ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ వైఖరిపై ఆ దేశంలో వ్యతిరేకత తీవ్ర తరమవుతున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ వరుసగా విదేశీ పర్యటనలు జరుపుతున్నారు. ఇటీవల ఉక్రెయిన్‌లో జాన్సన్ ఆకస్మిక పర్యటన చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఆయన ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా, భారతదేశం తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా వ్యతిరేక వైఖరి తీసుకోవాలని భారత్‌పై అమెరికా సహా పలు దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మనదేశానికి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారత ప్రధాని మోదీతో జాన్సన్ లోతైన చర్చలు జరపనున్నారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ నెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారిక సమావేశం ఢిల్లీలో జరుగుతుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ సందర్భంగా రోడ్‌మ్యాప్ 2030 అమలును ఇరువురు నేతలు సమీక్షిస్తారని, పూర్తి స్పెక్ట్రమ్ ద్వైపాక్షిక సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టిపెడతారని పేర్కొంది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఇరుదేశాల వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యాలపై చర్చించనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించిన స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం పురోగతిపైనా దృష్టి సారించనున్నారు.
భారత్ పర్యటనకు ముందు బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి, రక్షణ, ఇంధన రంగాల్లో భద్రత తదితర అంశాలపై తన పర్యటన కొనసాగనుందని చెప్పారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలిపారు.
నియంతృత్వ శక్తులు శాంతిసామరస్యాలకు సవాలు విసురుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశాలు కలిసికట్టుగా ఉండాల్సిన అవసరముందని చెప్పారు. అతిపెద్ద ఆర్థిక శక్తి, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్కుబ్రిటన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.