తాను గతంలో బిజెపి నేత కావడంతో తెలంగాణ ప్రభుత్వం తనను ఆ దృష్టితోనే చూస్తున్నదని రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. తన రాజకీయ గతాన్ని ఇప్పుడు తాను చెరిపివేసుకోలేనని పేర్కొంటూ అంతమాత్రం చేత గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా చేయడం తగదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో ముచ్చడిస్తూ తనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తున్న కారణంగా తనను కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే చూస్తోందని తెలిపారు. ఏ రాష్ట్రంలోనైనా గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విబేధాలొస్తే వాటిని వ్యక్తిగతంగా తీసుకోరని, కానీ తెలంగాణలో తనను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ప్రోటోకాల్ వివాదంతో సహా మరే అంశంపై తాను కేంద్రానికి ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని తమిళసై స్పష్టం చేశారు. ప్రతి గవర్నర్ ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులపై కేంద్రానికి నివేదికలు అందజేస్తుంటారని ఆమె గుర్తు చేశారు.
తాను కూడా అలాగే నివేదికలు సమర్పిస్తానని చెబుతూ ఆ నివేదికల్లో అన్ని అంశాలూ ప్రస్తావిస్తూ ఉంటానని తెలిపారు. తానిచ్చిన నివేదికపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే తాను చెప్పలేనని, అయితే కేంద్రం మౌనంగా ఉందని మాత్రం అనుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్ వ్యవస్థను తేలిగ్గా తీసుకోవద్దని ఆమె పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ వ్యవస్థను ఎందుకు గౌరవిచండం లేదని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల మద్దతు ఉంది కాబట్టే తాను బలంగా ఉన్నానని చెబుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి తనకు నైతికంగా మద్దతిస్తున్నారని ఆమె తెలిపారు. ‘‘నా మీద విశ్వాసం ఉంది కాబట్టే తెలంగాణకు గవర్నర్‌గా, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. నాయకుల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది” అని తెలిపారు.
“గవర్నర్ వారం రోజుల పాటు సెలవు తీసుకోవచ్చు. కానీ, నేను ఎప్పుడూ సెలవు తీసుకోకుండా పనిచేశా. నా జీవితం పారదర్శకం. నన్ను మార్చేస్తారని (గవర్నర్ పదవి నుంచి తప్పించడం) బెదిరించలేరు. నా సమర్థతను, విధులను ఎవరూ ప్రశ్నించలేరు. ఎలా పనిచేయాలో ప్రధాని, కేంద్ర హోం మంత్రి నుంచి నేర్చుకున్నాం. వాటిని ఆచరిస్తున్నాం’’ అని ఆమె వివరించారు. అలాగని రాజ్యాంగ పరిధిలో ఏదైనా చర్య చేపడితే ప్రజాస్వామ్యానికి విఘాతమంటూ విమర్శలు చేస్తారని ఆమె విచారం వ్యక్తం చేశారు.
తమిళనాడులో గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం విబేధించినప్పటికీ, వ్యక్తిగతంగా గవర్నర్‌పై ఎలాంటి వ్యతిరేకత లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా సభలోనే వ్యాఖ్యానించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మాత్రం వ్యక్తిగతంగా విమర్శిస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరకు ఆ ట్రోలింగ్‌ను గమనించిన ప్రజలే “ఒక గవర్నర్‌గా కాకపోయినా, ఒక మహిళను ఇలా అవమానిస్తారా” అంటూ స్పందిస్తున్నారని తమిళిసై గుర్తు చేశారు. తాను తమిళిసైకి గౌరవమివ్వాలని చెప్పడం లేదని, గవర్నర్ పదవిని, కార్యాలయాన్ని గౌరవించాలని మాత్రమే చెబుతున్నానని ఆమె స్పష్టం చేశారు.
ఈరోజు తానుండవచ్చు, రేపు ఇంకెవరైనా రావచ్చు. ఇవాళ కేసీఆర్ సీఎంగా ఉండవచ్చు. రేపు మరొకరు ఉండవచ్చు. కానీ ఏ పదవికి ఇవ్వాల్సిన గౌరవం ఆ పదవికి ఇవ్వాలని ఆమె సూచించారు. గవర్నర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. సర్పంచ్ పదవైనా, గవర్నర్ పదవైనా.. వ్యవస్థల్ని మనం గౌరవించాల్సిందేనని తమిళిసై వ్యాఖ్యానించారు.
తానెప్పుడూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంటాను తప్ప, ఇలాంటి ప్రొటోకాల్ గురించి పెద్దగా పట్టించుకోనని ఆమె పేర్కొన్నారు. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు సైతం కనీసం భద్రతాపరమైన ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని తమిళిసై విచారం వ్యక్తం చేశారు.