రాష్ట్రాన్ని నీట్ నుండి మినహాయించాలని కోరుతూ శాసనసభలో రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించిన్న బిల్లును ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదానికి పంపేందుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సిద్ధమైనట్లు సంకేతం ఇచ్చారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ శాసనసభలో సభా నిబంధన 110 కింద నీట్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనందుకే గవర్నర్ తేనీటి విందులో పాల్గొనలేదని ప్రకటిస్తున్న సమయంలోనే రాజ్‌భవన్ నుంచి మీడియాకు ‘లీకులు’ రావడం గమనార్హం.
ఆ మేరకు నీట్ బిల్లును గవర్నర్ పరిశీలించారని, త్వరలోనే దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయమై గత పలు నెలలుగా తమిళనాడు ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ లకు మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఈ నే పథ్యంలో వాస్తవ పరిణామాలను పరిశీలించిన తరువాత అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం స్టాలిన్ సభలో వెల్లడించారు.
తమిళనాడు అసెంబ్లీలో 110 విధుల కింద సీఎం స్టాలిన్ ఒక ప్రకటనను విడుదల చేస్తూ ‘ఏడున్నర కోట్ల తమిళ ప్రజానీకం ప్రతిఫలించేలా అసెంబ్లీలో ఆమోదించిన నీట్ వ్యతిరేక తీర్మానం గత 210 రోజులుగా రాజ్‌భవన్‌లోనే పడి ఉంది. వందేళ్లు పూర్తి చేసుకున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీట్ మినహాయింపు బిల్లు చెన్నై గిండీలోని రాజ్‌భవన్ ప్రాంగణంలో ఎవరికీ పట్టని విధంగా మూలవేశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
`అలాంటి రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందుకు ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకావడం ప్రజాభీష్టాన్ని అవమానించడమే అవుతుంది. అందుకే గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు గైర్హాజరయ్యాం. ఈ పరిస్థితులకు సంబంధించి గవర్నర్‌కు నేనే ఓ ఉత్తరం రాశాను. మీతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి భేధాభిప్రాయం లేదు, సామాజిక బాధ్యతకు కట్టుబడే తేనీటి విందుకు రాలేదని ఆ ఉత్తరంలో స్పష్టం చేశాను’ అని కూడా ఈ సందర్భంలో తెలిపారు.
`మా ప్రభుత్వ విధానాల గురించి గవర్నరే బహిరంగ వేదికలపై ప్రశంసించారు. గవర్నర్ అనే హోదాకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ తగిన గౌరవం ఇస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు లభించే ప్రశంసల కంటే రాష్ట్ర ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. అలాగే గవర్నర్ సైతం ఈ అసెంబ్లీని గౌరవించి నీట్ వ్యతిరేక తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. అలా పంపక పోవడం తమిళనాడు ప్రజలను అవమానించడమే అవుతుంది’ అంటూ పరోక్షంగా గవర్నర్ ను హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో సదరు తీర్మానా న్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని గవర్నర్ నిర్ణయించుకున్నట్లు మీడియాలో ప్రచారం అవుతోందని చెబుతూ, ఈ ప్రచారాన్ని వాస్తవం చేస్తూ జరిగే పరిణామాలను గమనిస్తామని, అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి చర్యలపై ముందుకు సాగుతామని స్టాలిన్ ప్రకటించారు.
గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలోనూ నీట్ మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అసెంబ్లీలో నీట్ మినహాయింపు బిల్లును ఆమోదించి గవర్నర్ పరిశీలనకు పంపినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో గత యేడాది మేలో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం నీట్ నుంచి మినహాయింపు ఎలా పొందాలన్న కిటుకు తమకు మాత్రమే తెలుసంటూ ప్రకటించింది.
ఆ నేపథ్యంలోనే నీట్ వల్ల విద్యార్థులకు కలుగుతున్న నష్టాలపై అధ్యయనం చేసేందుకు మాజీ న్యాయమూర్తి జస్టీస్ ఏకే నటరాజన్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా గత సెప్టెంబర్ 13న శాసనసభలో నీట్ మినహాయింపు ముసాయిదా చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఆ బిల్లును గవర్నర్‌కు పంపారు.
అయితే ఐదు నెలలపాటు ఆ బిల్లును ఆపివేసి, ఫిబ్రవరి ఒకటిన గవర్నర్ ఆ బిల్లును వెనక్కి పంపారు. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న సమష్టి నిర్ణయం మేరకు ఫిబ్రవరి 8వ తేదీన శాసనసభ ప్రత్యేక సమావేశంలో రెండోసారి నీట్ మినహాయింపు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్‌కు పంపారు.
మార్చి 15న నీట్ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపాలంటూ గవర్నర్ ఆర్ఎన్ రవికి ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కూడా గవర్నర్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడంతో తమిళ ఉగాది సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు డీఎంకే, దాని మిత్రపక్షాలు గైర్హాజరయ్యాయి.
గవర్నర్‌కు రాష్ట్రపభుత్వానికి విబేధాలు నెలకొన్నాయని ప్రసారమాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. అదే సమయంలో డీఎంకే పార్టీ పత్రిక ‘మురసొలి’లో నీట్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రస్వరంగా దుయ్యబట్టారు.
గవర్నర్ రాష్ట్రపతిననే భావనతో ఉన్నారంటూ ఆ సంపాదకీయంలో విమర్శించారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఆర్ఎన్ రవి పట్టుసడలించి నీట్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నీట్ బిల్లుపై గవర్నర్ సంతకం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపినా కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకారం తెలుపుతుందని చెప్పలేము.
గవర్నర్ ఈ బిల్లును నేరుగా రాష్ట్రపతికి పంపటానికి వీలులేదు. కేంద్ర హోం శాఖ ద్వారానే పంపించాలి.. ఈ బిల్లుపై ముందుగా హోం శాఖ ఆధ్వర్యంలో న్యాయశాఖ పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపటానికి వీలుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదటి నుంచి నీట్‌కు మద్దతుగానే వ్యవహరిస్తుండటంతో నీట్ మినహాయింపు బిల్లును వ్యతిరేకించే అవకాశాలే అధికంగా ఉన్నాయి.