కొద్దికాలంగా కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్న గుజరాత్ లో పటీదార్ ఉద్యమ నేత, ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
తాజాగా, హార్దిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన హార్దిక్ తాజాగా ఉన్నఫలంగా తాను రాముడి భక్తుడినని ప్రకటించుకొన్నారు. అలాగే బిజెపిని ప్రశంసించారు. బిజెపికి సంబంధించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయని, వాటిని మనం అంగీకరించాలని స్పష్టం చేశారు.
ఇటీవల ఒక ప్రాంతీయ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి బిజెపి నాయకత్వం, నిర్ణయ సామర్థ్యాలు తనను ప్రభావితం చేశాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కలత చెంది బీజేపీని పొగడడం చెబుతూ ఫోన్ ఎలా అప్డేట్ అవుతుందో అలాగే తమ పార్టీలో బీజేపీ క్రమం తప్పకుండా మార్పులు తీసుకువస్తుందని పటేల్ కొనియాడారు.
ఎన్డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, “బిజెపికి సంబంధించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయని మనం అంగీకరించాలి” అని తాను గ్రహించానని తెలిపారు. గుజరాత్లో కాంగ్రెస్ మెరుగ్గా రాణించాలంటే, ఆ పార్టీ నిర్ణయాత్మక నైపుణ్యాలను, నిర్ణయాధికారాన్ని మెరుగుపరచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
“రాజకీయంగా బిజెపి తీసుకున్న ఇటీవలి నిర్ణయాలు, అలాంటి చర్యలు తీసుకునే శక్తి వారికి ఉందని మనం అంగీకరించాలి. వారి పక్షం వహించకుండా లేదా వారిని ప్రశంసించకుండా, మనం కనీసం నిజాన్ని గుర్తించగలమని నేను నమ్ముతున్నాను” అని పేర్కొన్నారు.
తన హిందుత్వ గుర్తింపు పట్ల గర్విస్తున్నానని చెప్పడం ఆయన బిజెపి పరిభాషలో మాట్లాడినట్లయింది. “నేను రఘువంశీ వంశం నుండి వచ్చాను, నేను లువ్-కుష్ వంశం నుండి వచ్చాను. నేను రామ్, శివుడు, కులదేవిని నమ్ముతాను. నేను హిందువుని. హిందూ ఆచారాలను అనుసరించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తాననిచేస్తాను. ఏప్రిల్ 28న మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా 4వేల గీతా ప్రతులను పంపిణీ చేయబోతున్నాను. నేను హిందువునైనందుకు గర్వపడుతున్నాను’ అని హార్దిక్ పేర్కొనడం గమనార్హం.
నర్మదా జిల్లాలోని రాజ్పిప్లాలో జరిగిన పార్టీ మోటార్‌సైకిల్ ర్యాలీకి హాజరైన గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ హార్దిక్ ప్రకటనలపై స్పందిస్తూ, “దేశం మొత్తం బీజేపీ భావజాలంతో ప్రభావితమైంది… .హార్దిక్ పటేల్ మాత్రమే కాదు, కాంగ్రెస్‌లోని చాలా మంది నాయకులు కూడా ఇటువంటి అభిప్రాయలు వ్యక్తం చేయడం సహజం. కానీ ఇతర నాయకులు బహిరంగంగా చెప్పలేరు. హార్దిక్ ధైర్యం చేసి బహిరంగంగా చెప్పాడు” అంటూ కొనియాడారు.
తాను బీజేపీలో చేరే విషయమై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా ప్రాంతీయ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, గుజరాత్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు తాను చేయగలిగినదంతా చేస్తానని స్పష్టం చేశారు. గత వారం గుజరాత్లో కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ యూనిట్ ఆయనను పాత పార్టీతో “తన సమయాన్ని వృధా” చేయకుండా తమ పార్టీలో చేరమని ఆహ్వానించింది.
అయితే, పటేల్ మాట్లాడుతూ, “చాలా మంది నన్ను కేజ్రీవాల్‌తో ముడిపెట్టారు. కాంగ్రెస్, ఆప్, బిజెపి – నాకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి” అని చెప్పడం గమనార్హం. తాను బిజెపి చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై హార్ధిక్ పటేల్ స్పందిస్తూ.. తాను పార్టీ మారాలా? వద్దా అన్నది మాత్రం మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నాన్ని చెప్పడం గమనార్హం.