భారతదేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన కృషి జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. క్రీడలను జీవనోపాధి మార్గంగా ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన వాతావరణాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. ఈ ప్రయత్నంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటుచేసి క్రీడావ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాన్ని ప్రారంభించాలని కోరారు.
ఆదివారం బెంగళూరులో ‘ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు – 2021’ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన 4500 మంది యువ క్రీడాకారులను, క్రీడా ప్రముఖులు, ప్రైవేటు రంగం ప్రతినిధులు, పాల్గొన్నారు. విదేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో క్రీడలకు విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలో ఇస్తున్న ప్రాధాన్యత, ప్రోత్సాహం ఒలింపిక్స్ లో ఆ దేశం సాధిస్తున్న పతకాల పట్టికలో కనబడుతోందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు.
క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ప్రైవేటు రంగం, సామాజికవేత్తలు, ప్రముఖ క్రీడాకారులు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని చెప్పారు. క్రీడా మౌలికవసతుల నిర్మాణంతోపాటు సామర్థ్యమున్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడం, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ముందుండాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.
మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా సామర్థ్యాన్ని వెలికితీసి సానబెట్టాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా కేంద్రం ‘ఖేలో ఇండియా’ పేరుతో చేపట్టిన కార్యక్రమం ఓ అద్భుతమైన ఆలోచన అన్న ఉపరాష్ట్రపతి.. ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లోని సామర్థ్యాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం, అవసరమైన వసతుల కల్పన ద్వారా ప్రపంచ క్రీడాయవనికపై భారతదేశ కీర్తిపతాకను రెపరెపలాడించేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు.
యోగాసనాలు, మల్లఖంబ వంటి దేశీయ క్రీడలతోపాటు 20 రకాల వివిధ క్రీడల్లో ఈసారి ఖేలో ఇండియా పోటీల్లో నిర్వహిస్తుండటాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి.. భారతీయ క్రీడలను ముఖ్యంగా గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. గ్రామీణ క్రీడల్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు.
క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక సంతులనం పెరుగుతుందన్న ఉపరాష్ట్రపతి.. క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవడం ద్వారా ఏ రంగంలోనైనా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. ఆరోగ్యకరమైన పోటీలో భాగస్వాములయ్యేందుకు క్రీడలు వ్యక్తిగతంగా ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు.
అందుకే క్రీడలు, యోగా ను పాఠశాలల పాఠ్యప్రణాళికలో చేర్చడం ద్వారా బాల్యం నుంచే విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి, శారీరక, మానసిక సంతులనం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి వంటివి పెంపొందించవచ్చన్నారు. నూతన జాతీయ విద్యావిధానం – 2020 కూడా ఈ దిశగా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చిందని వివరించారు.
ప్లాస్టిక్ వినియోగం లేకుండా, పునర్వినియోగ వస్తువులను వినియోగించడం కారణంగా ఈ క్రీడలు మొట్టమొదటి గ్రీన్ గేమ్స్ గా నిలిచిపోతాయని ఉపరాష్ట్రపతి తెలిపారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కర్ణాటక రాష్ట్ర మంత్రి డాక్టర్ కేసీ నారాయణ గౌడ పాల్గొన్నారు.